న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కృత్రిమ మేధాపై శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నది. ప్రపంచ దేశాలకు చెందిన ఐఏ నిపుణులు ఆ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) మాత్రం ఆహ్వానం అందలేదని తెలిసింది. వాస్తవానికి బిల్ గేట్స్ ప్రస్తుతం ఇండియాలోనే టూరు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఏపీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇటీవల అమెరికాతో పాటు అనేక దేశాలను కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ నేపథ్యంలో బిల్ గేట్స్‌కు ఆహ్వానం అందించలేదని తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన ఆహ్వానంపై పునరాలోచ చేశామని, గేట్స్‌కు ఆహ్వానం పంపవద్దు అన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలిసింది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరవుతున్న ముఖ్యమైన స్పీకర్లలో బిల్ గేట్స్ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
అమెరికా ఫైనాన్షియర్, చైల్డ్ సెక్స్ నేరస్తుడైన జెఫ్రీ ఎప్స్టీన్కు చెందిన కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను ఇటీవల అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ ఫైల్స్‌లో బిల్ గేట్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. బిల్ గేట్స్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఎప్స్టీన్ ఆరోపించాడు. రష్యన్ అమ్మాయిలతో రిలేషన్ ఉన్నట్లు ఆ ఫైల్స్‌లో ఉన్నది. బిల్ గేట్స్ ఒక్కడే కాదు.. ప్రపంచదేశాలకు చెందిన నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఎప్స్టీన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే 2019లో న్యూయార్క్ జైలులో చనిపోయిన విషయం తెలిసిందే. ఇక తన తప్పును గ్రహించిన బిల్ గేట్స్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పారు. ఎప్స్టీన్తో గడిపిన ప్రతి నిమిషాన్ని బాధగా వర్ణించారు. ఆ ఘటనల పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.