పెద్దశంకరంపేట,ఆగస్టు12 : నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరపేటకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన సోషల్ మీడియా కథనాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. యూట్యూబ్ చానల్ చరణ్ టీవీ జర్నలిస్ట్ విషయం పెద్దశంకరంపేట పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాయకుల మధ్య అగ్గి రాజేసింది. గతంలో యూట్యూబ్ ఛానల్ వ్యక్తి పెద్దశంకరంపేట మండలంలో ఆయా పార్టీల నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని వార్తలు రాయడంపై ఇరుపార్టీల నాయకుల మధ్య వాట్సాప్‌లో ప్రచారం చేస్తూ ఒక్కరిపై మరొకరు దూషణలు చేసుకుంటూ విమర్శలు చేసుకున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటికి వచ్చి రహదారిపై ఆందోళనకు దిగారు.అదే సమయంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాజీ ఎంపీ పీ జంగం శ్రీనివాస్‌తో కలిసి రావడంతో ఒక్క సారిగా కాంగ్రెస్ నాయకులు వారితో పాటు వాహనంపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న ఎస్సై ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై చంద్రమోహన్, పోలీసులు కాం గ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్‌ల్లో అధికార, అనధికార పార్టీ నాయకులు దూషణలకు పాల్పడినా అడ్మిన్‌తో పాటు అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపుల్లో వ్యక్తిగత దూషణల పోస్టులు వస్తే గ్రూప్ అడ్మిన్లు వెంటనే తొలింగించాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నారాయణఖేడ్, ఆగస్టు 12: ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని, బీఆర్ఎస్ బలపడుతుందనే అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌పై స్థానిక కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగడం దారుణమని ఆయన ఖండించారు. మూకుమ్మడిగా దాడి చేసి జంగం శ్రీనివాస్‌కు చెందిన మెడికల్ షాప్‌ను ధ్వంసం చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.