సిద్దిపేట, నవంబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజలు, రైతులను మోసగించి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తి ప న్నుతోంది. బూటకపు హామీలు గుప్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఇందులోభాగంగానే కాంగ్రెస్ రైతుబంధుపై బూటకపు హామీ లు ఇస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు కొనసాగిస్తామని చెబుతున్నది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దీనిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని రైతులు, రైతు సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు డబ్బులు భూ యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరికో ఒక్కరికీ మాత్రమే అందజేస్తామని తెలిపారు. భూ యజమానికి రైతుబంధు ఇస్తే కౌలు రైతుకు ఇవ్వమని, కౌలు రైతులకు డబ్బులు ఇస్తే యజమానులకు ఇవ్వమని తెలిపారు.
తమకు ఓటు వేస్తే భూ యజమానులకు, కౌలు రైతులకు రైతుబంధు డబ్బులు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతున్న రేవంత్‌రెడ్డి మీడియాలో మాత్రం రైతుబంధుపై ఎన్నికలకు ముందే మాట మార్చారు. రేవంత్‌రెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని స్పష్టం అవుతున్నది. ఆ పార్టీ రైతుబంధుపై బూటకపు హామీలు ఇవ్వటంపై ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. రైతులకు న్యాయం చేసేలా, రైతులను ఆదుకునేలా ఎన్నికల హామీలు ఉండాలే తప్ప రైతులను మోసగించేలా హామీలు ఉండవద్దని కర్షకలోకం కాంగ్రెస్‌పై మండిపడుతున్నది. కాంగ్రెస్ ఇకనైనా తప్పుడు హామీలతో ప్రజలను మోసగించే ప్రయత్నం మానుకోవాలని లేదంటే రైతులు ఆగ్రహానికి గురికాకతప్పదని రైతులసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ భూయజమానితోపా టు తమకు రైతుబంధు డబ్బులు అందజేస్తుందని కౌలు రైతులు సంబురపడుతున్నారు. అయితే ఇప్పుడు పీసీసీ చీఫ్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే రైతుబంధు డబ్బులు ఇస్తామని చెబుతుండడంతో కౌలు రైతులు కాంగ్రెస్‌ను నమ్మొదంటున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేస్తే నిండా ముంచుతుందని కౌలు రైతులు వాపోతున్నారు.
హుస్నాబాద్ రూరల్, నవంబర్ 26: రైతుల గురించి ఆలోచించే ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్. కాంగ్రెస్ సర్కారొస్తే మూడు గంటల కరెంట్ ఇస్తామని చెబుతున్నది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పదేండ్లలో ఎప్పుడూ కరెంట్ కోసం తిప్పలు పడలేదు. నాకు ఎకరం పొలం ఉంది. 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండుగలాగా చేసుకుంటున్న. నాకు డబుల్బెడ్రూం ఇల్లు వచ్చింది. ఇంత మంచి సర్కార్‌ను కాదని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓట్లు వేస్తరా. రైతులకు లాభం చేసే ఆలోచనలు చేయాలి. రైతులను ముంచే ఆలోచనలు కాంగ్రెసోళ్లు మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత సబ్స్టేషన్లు కూడా పెరిగినయి. లోఓల్టేజీ సమ స్య లేకుండా నాణ్యమైన కరెంట్ వస్తున్నది.
12 ఎండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. కాంగ్రెసోళ్లు 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోమంటున్నరంటే ఇక ఎవుసానికి రాంరాం చెప్పాల్సిందే. ఒక్కో మోటర్‌కు రూ.80వేలు అయితది. అదికాలిపోతే మస్తు పైసలు ఖర్చు చేయాలి. నాకున్న నాలుగున్నర ఎకరాలను ఒక్క బోర్ మోటర్తో సాగు చేస్తున్న. పంటను మార్కెట్లో అమ్ముకుంటున్న. సీఎం కేసీఆర్ వచ్చినంక రైతులకు అంతా మంచి జరుగుతున్నది. కరెంటు మూడు గంటలే ఇస్తం.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మోటర్లు కాలిపోతలేవు. రైతులను ఆగం చేసే వాళ్లను నమ్మొద్దు. రైతులంతా ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నరు.
హుస్నాబాద్ రూరల్, నవంబర్ 26: కాంగ్రెస్ పాలనలో అర్ధరా త్రి కరెంట్ ఇచ్చి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్లు. ఒక్కోసారి అర్థరాత్రి 3గంటలకు కరెంట్ వస్తదని బాయిల కాడికి పోయేటోళ్లం. ఒక్కరు పోవాలంటే భయమయ్యేది. ఇంట్లో ఆడోళ్లను కూడా తీసుకుపోయి బాయికాడ పడుకున్న రోజులున్నయి. అప్పుడు వ్యవసా యం చేయాలంటే ఎంతో కష్టమయ్యేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24గంటలు కరెంట్ ఉంటున్నది. ఎప్పుడంటే అప్పుడు బాయిల కాడికిపోయి నీళ్లు పెట్టి వస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు అండగా ఉంటున్నయి. మళ్లీ కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్నే గెలిపిస్తాం. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మే స్థితుల్లో రైతులు లేరు.
వ్యయసాయానికి 3 గంటల కరెంట్ అనేది ఉత్త ముచ్చట. వ్యవసాయం చేసినోళ్లు ఇట్లా మాట్లాడరు. 3 గంటల కరెంట్‌తో ఎవుసం ఎట్లా చేస్తరో ఉత్తమ్‌కుమార్, రేవంత్‌రెడ్డి మా ఊరికి వచ్చి చూపించాలె. 10 హెచ్‌పీ మోటరు పెడితే ఆ ప్రెషర్‌కు పైపులుంటయా, భూమిలో అంత ఊటా వస్తదా? మాకు పదెకరాల భూమి ఉంది. ఇప్పుడు కేసీఆర్ సర్కారులో నిరంతరం కరెంట్ ఉంటున్నది. ఎకరానికి 16 క్వింటాళ్లు, మొత్తం 160 క్వింటాళ్ల వడ్లు పండినయి. ఇప్పుడున్న కరెంట్, నీళ్లతో మంచిగా పంటలు పండుతున్నయ్. రైతులమంతా చాలా సంతోషంగా ఉన్నరు. కాంగ్రెసోళ్ల మాటలు వింటే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయి. కాంగ్రెస్ వస్తే రోజూ బాయిలకాడ పండాల్సిన రోజులస్తయ్.. దినాం పక్క రైతులతో గొడవలు అయితయ్..
కాంగ్రెస్ గెలిచేది కాదు.. పోయేది కాదు. మూడు గంటల కరెంటు ఇచ్చుడు అంటే రైతుల నెత్తిమీద మొండి చేయి పెట్టినట్లే. కాంగ్రెస్ పదేండ్ల పాలన చూసి నం. ఏ రోజు రైతులను వాళ్లు ఆదుకోలే. మూడు గంటల కరెంటుతోని దొయ్య పారది. మడి తడ్వది. ఎవుసం గురించి కాంగ్రెసోళ్లకు ఏం తెలుసు. కాంగ్రెస్ వస్తే బాయిలకాడ కరంట్ కోసం కావాలి కాయాల్సి వస్తది. కాంగ్రెస్ రైతుల బతుకులు ఆగం చేయాలని చూస్తున్నది. మూడు గంటల కరెంటిస్తే ఎనుక మడులు తడ్వయి. పంట ఎండిపోతది. అందుకే కాంగ్రెస్‌కు ఓటు వేయం.
హుస్నాబాద్, నవంబర్ 26: రైతులను ఆగం చేసేందుకే కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు, 10హెచ్‌పీ మోటార్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. అలా చేస్తే బాయిలు, బోర్లల్ల నీళ్లుంటయా? పంట చివరి వరకు నీళ్లు అందుతయా? 2014కు ముందు కరెంటు, నీళ్లకు ఎంత ఇబ్బంది పడ్డమో మా రైతులకు తెలుసు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ రైతుల కష్టాలు అన్నీఇన్ని కావు. వచ్చీరాని కరెంటుతో మొదటి మడి తడిసేది కాదు. కరెంటు కోసం రాత్రుళ్లు బాయిలకాడనే పడిగాపులు కాసేది. పాముకాటుకు బలైన రైతులు ఉన్నరు. తెలంగాణ సర్కారు వచ్చినంక 24గంటల కరెంటు, పుష్కలంగా సాగునీరు ఇచ్చి ఆదుకున్నది. పంటలు బాగా పండుతున్నయి. ఆ పంటనంతా సర్కారే కొంటున్నది. ఇప్పటివరకు వ్యవసాయానికి 10హెచ్‌పీ మోటార్లు వాడిన రైతులే లేరు.
తెలంగాణ రాకముందు కాంగ్రెసోళ్లు పాలించినప్పుడు బాయి కాడ కరెంట్ కోసం కావాలి ఉండేటోళ్లం. ఎప్పుడు కరెంట్ వొస్తాదో, ఎప్పుడు పోతదో ఎవరికీ తెల్వకుండే. కేసీఆర్ సీఎం అయినంకా కరెంట్ మంచిగా వస్తంది. గప్పటిలెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతలేవు. ఒక వేళ ఎప్పుడైన కాలిపోతే వెంటనే అధికారులు ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఫిట్ చేస్తున్నరు. ఎండలు గట్టిగా కొడుతున్న కూడా కరెంట్ మంచిగానే వస్తున్నది. కాగ్రెస్ కాలంలో యాసంగి పంట వేయలంటే భయమయ్యేది. కరెంట్ సమస్య ఉంటదని సగం కంటే తక్కువ సాగు చేసేటోళ్లం. గిప్పుడు గా కరెంట్ సమస్య లేదు. అన్ని తెలిసిన రైతులు కాంగ్రెస్‌ను నమ్మరు.
కోహెడ, నవంబర్ 26: ఎవుసానికి 24గంటల త్రీఫేస్ కరెంట్ ఉండాల్సిందే. లేకుంటే మునుపటిలెక్క గోస తప్పదు. ఇది వరకు పడ్డ కష్టం మల్లద్దు. కటికేస్తే కరెంట్ వస్తంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఖతమే. మళ్లీ రాత్రుళ్లు బాయిలకాడికి పోయి కరెంట్ పెట్టుకోవాలి. చేతిల ఓటు ఉండగా మళ్లీ గోస ఎందుకు? కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను గెలిపించుకుందాం. కాంగ్రెస్ మూడు గంటలు, బీజేపీ 5గంటల కరెంట్ ఇస్తా అంటున్నది. గిట్ల ఇస్తే ఎట్లా ఎవుసం చేస్తాం. ఎవుసం సాగాలంటే మనం ఆలోచించుకొని ఓటెయ్యాలి.