గజ్వేల్, జూన్ 16: అభివృద్ధ్దిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడం చేతకాక కేసీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. రైతాంగానికి సాగునీరందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మండుటెండల్లో సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70ఏండ్ల పాలనలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడేవారని, అలాంటి తెలంగాణను వెలుగు జిలుగులు తెలంగాణగా మార్చింది కేసీఆర్ అన్నారు.
విద్యుత్ కమిషన్ విచారణ పేరుతో కేసీఆర్‌పై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతిసేలా కాంగ్రెస్ ప్రభు త్వం చూస్తున్నదని, కక్షపూరితంగా ఏర్పాటు చేసిన నర్సింహరెడ్డి కమిషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ సర్కారు ఆరు మాసాలు గడిపిందన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ ప్రభుత్వం 90శాతం పనులు పూర్తి చేసిందని, అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీలు మల్లేశం, బాలమల్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.