సంగారెడ్డి, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): గోదావరి జలాలతో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సంకల్పాన్ని చెరిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. అధికారంలోకి రాగానే కేసీఆర్ శంకుస్థాపన చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసింది. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే రెండు ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ తీరును నిలదీసింది. మాజీమంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తీరును పలు సందర్భాల్లో ఎండగట్టారు. రైతులకు మేలు చేసే రెండు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల సంగారెడ్డికి వచ్చిన మాజీమంత్రి హరీశ్‌రావు కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. అదేరోజు విలేకరుల సమావేశం నిర్వహించి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించ కుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హరీశ్‌రావు హెచ్చరికలకు తోడు మంగళవారం శాసనసభలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తామని చెప్పింది. అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేశారు. త్వరలోనే రెండు ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తామన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు 2021లో నారాయణఖేడ్‌లో రెండు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4427 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ పనులు ప్రారంభించింది. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను మాజీమంత్రి హరీశ్‌రావు బోరంచలో ప్రారంభించారు.
జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.2653 కోట్లతో మునిపల్లి మండలం చిన్నచెల్మడ వద్ద సంగమేశ్వర పనులను ప్రారంభించారు. రెండు ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పూర్తి చేయడంతోపాటు పనులు ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి ఎత్తిపోతల పనులను ప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.