జహీరాబాద్/ కోహీర్/ ఝరాసంగం 23 : విశ్వగురు బసవేశ్వరుడి స్ఫూర్తితో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి బైపాస్ సెంటర్లో రూ.60లక్షలతో నిర్మించిన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బసవేశ్వరుడి సందేశాలతో రాహుల్‌గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడా యాత్ర చేశాడన్నారు. బసవేశ్వరుడు అందించిన సూచనలు, స్ఫూర్తి, సందేశాలతో అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం చేసేందుకు కులగణన చేపట్టిందని వివరించారు. ఆనాడే చట్టసభల్లో ప్రజానిర్ణయాలకు భాగస్వామ్యం కల్పించాడన్నారు. వారి సందేశంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు.
జహీరాబాద్ పర్యటనలో భాగంగా హుగ్గెల్లిలో విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల వరకు తొమ్మిది కిలో మీటర్ల మేరకు రూ.173కోట్లతో నిర్మించిన నాలుగు లైన్ల నిమ్జ్ రోడ్డు, మాచ్నూర్లో రూ.26కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద శిలాఫలకాలతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
జహీరాబాద్-బీదర్ రోడ్డుపై రూ.90కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. జహీరాబాద్ మున్సిపాలిటీ ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.66కోట్లతో నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రూ.97.07 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లను పునరుద్ధరించనున్నారు. చిరాగ్పల్లి-మన్నాపూర్ మధ్య తొమ్మిది కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్డును అనుసంధానం చేయనున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, బొంతపల్లి, మాంబాపూర్, ఖాజీపల్లి ప్రాంతాల్లో హరిత నిధి ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు రూ.9.60కోట్లతో ఆ పథకాన్ని 2,485 హెక్టార్లలో అమలు చేయనున్నారు.
మొగుడంపల్లి, గుమ్మడిదలతో రూ.6.20కోట్ల తో నిర్మించిన కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ భవనాలను ప్రారంభించారు. కవేలి జాతీయ రహదారి పక్కన రూ. 1.99కోట్లతో నిర్మించే పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 454మందికి రూ.72.11కోట్లను చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, మదన్మోహన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
జహీరాబాద్ /కోహీర్/ఝరాసంగం, మే 23 : జహీరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పస్తపూర్లో శుక్రవారం నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. సభలో ముందుగా ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ మాట్లాడిన మాటలను జనం శ్రద్ధగా విన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించగానే జనం ఇంటి దారి పట్టడం ప్రారంభించారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఓ వైపు సీఎం చెబుతున్నా వాటిని పట్టించుకోలేదు. సీఎం ప్రసంగం కూడా ప్రజలకు అర్థం కాలేదు. అప్పటికే సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. ఉదయం 11గంటలకు సభ ఉందని జనాన్ని అక్కడికి తరలించారు. కానీ సభ చాలా ఆలస్యంగా మొదలైంది. మధ్యాహ్నం 1:30కి సభ ప్రారంభం కావడం, సీఎం 2:30కి మాట్లాడటం, ఆకలి కోసం జనం ఇబ్బంది పడ్డారు. జనం అక్కడి నుంచి వెళ్తుంటే పోలీసులకు కూడా ఏంజరుగుతుందో అర్థం కాలేదు.