సిర్గాపూర్, ఆగస్టు 25: అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని, ప్రజలను సీఎం రేవంత్ నమ్మించి నట్టేట ముంచారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకుల సమావేశం, రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో వరినాట్లు వేయక మునుపే రైతుల ఖాతాలో రైతుబంధు జమ అయ్యేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. బోగస్ మాటలు, బోగస్ పాలనతో తెలంగాణ వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పాలన సాగితే భవిష్యత్తులో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనకబడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతులకు యూరియా ఇవ్వలేన దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని ఎద్దేవా చేశారు. బ్లాక్‌లో యూరియా అమ్ముతున్న పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, రైతులతో పాటు ప్రజలు కష్టాలు అన్నీ తొలిగిపోతాయని చింతా ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీకి నమ్ముకున్న వారందరికీ బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, జంగం శ్రీనివాస్, విఠల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు సంజీవరావు,యాదవరావు, కిరణ్‌రావు, పరమేశ్వర్, శాంతాబాయి, భారతీబాయి, ముజమ్మిల్, విజయ్‌బుజ్జి, నగేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు భవిష్యత్తులో రైతుల భరోసా రాదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. రైతులకు, ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రేవంత్ పాలనలో కరెంట్ సమస్యలు, సాగునీటి కష్టాలు, యూరియా వెతలు రైతులను వేధిస్తున్నాయని, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే, రేవంత్ పాలనలో రైతులు రోడ్డున పడుతున్నారని భూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఇటీవల సర్కారు రూపొందించిన పనులు జాతర కార్యక్రమం కాదని, అది పనికి మాలిన జాతర అని విమర్శించారు. ఆరుగ్యారెంటీలు, హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సిర్గాపూర్ ప్రత్యేక మండల వ్యవస్థ, పీహెచ్సీ, ఎస్టీ గురుకులం, బీటీ రోడ్ల విస్తరణ, 10 కొత్త జీపీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కాదే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తనపై అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మండలంలోని వాసర్ వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని గతేడాది శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని, త్వరలోనే ఏడాది పిండం పెడతామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసంపనిచేయాలని క్యాడర్‌కు మహారెడ్డి భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, దీనికోసం బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పిలుపునిచ్చారు. అన్నం పెట్టే రైతన్న బాగున్నప్పుడు దేశం బాగుంటుందని, రైతులకు నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. నిత్యం కేసీఆర్‌ను విమర్శించడం, అన్నీ అబద్ధ్దాలు మాట్లాడే సీఎం రేవంత్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసహనం చేస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేస్తే, కాంగ్రెస్ సర్కారు పండబెట్టిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పిలుపునిచ్చారు.
– జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు