సిద్దిపేట, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పోసి ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కాచుకుని కూర్చుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక కనిపించక వేలాది క్వింటాళ్ల పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది.
ఎండలో, వర్షంలో ధాన్యాన్ని కాపాడుకుంటూ రైతులు నెల రోజులుగా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కండ్ల ముందే ధాన్యం పాడవుతుంటే కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవైపు పంట పండించడానికి చేసిన అప్పులు.. మరోవైపు అమ్మకాలు జరగక చేతికి డబ్బు రాక రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది రైతులు చేసేదేమి లేక కేంద్రాల నుంచి తీసుకుపోయి అడ్డికి పావుశేరుకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.ప్రైవేట్ వ్యాపారులు ఇదే అవకాశంగా భావించి రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు ఎంత పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేశారన్న సమాచారం ఇవ్వడానికి అధికారులు వెనుకంజవేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ పూర్తయ్యిందని, అనుమతి ఇస్తే తప్పా కొనుగోలు చేయలేమని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకా వేలాది క్వింటాళ్ల పొద్దుతిరుగుడు మారెట్ యార్డుల్లోనే పేరుకుపోయింది. సిద్దిపేట జిల్లాలో 21,324 మంది రైతులు 16,131 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. ప్రతి ఎకరానికి 9 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్త్తదని వ్వవసాయాధికారులు అంచనా వేశారు.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం 1646 మంది రైతుల నుంచి 2200 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేశారు. జిల్లాలోని ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా 1,46మంది రైతుల నుంచి 2,200 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.7,721 ధర చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడుకు రూ.16.74 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటికీ మారెట్ యార్డుల్లో వేలాది క్వింటాళ్ల పొద్దుతిరుగుడు ధాన్యం కుప్పలుగా పేరుకుపోయింది. రైతులు చెమటోడ్చి పండించిన పంట కొనుగోలు కోసం కేంద్రాల వద్ద నెల రోజులుగా ఎదురుచూస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు.
పంట కోసం పెట్టిన పెట్టుబడులు, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులతో ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు అమ్మకాలు నిలిచిపోవడం మరింత భారంగా మారింది. ధాన్యం అమ్ముడుపోక చేతికి డబ్బురాక బ్యాంకు వాయిదాలు, ప్రైవేట్ అప్పులు, ఇంటి ఖర్చులు ఆగిపోయాయి. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ప్రైవేట్ వ్యాపారులకు తకువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల తేమ శాతం పేరుతో క్వింటాల్‌కు భారీ కోత విధించారు. దీంతో రైతు శ్రమకు సరైన ధర దకని పరిస్థితి ఇవ్వాళ రాష్ట్రంలో నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు తీవ్రమవుతున్నా ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన లేక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి బయట చెప్పేదొకటి లోపల చేసేదిమరొకటి ఉంది. తొగుట మారెట్ కొనుగోలు కేంద్రంలో పొద్దు తిరుగుడు ధాన్యం పోసి 40 రోజులు గడుస్తున్నా అధికారులు,ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రోజూ ధాన్యం వద్దకు వచ్చి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకుంటే గతంలో మాదిరి బయట ఎవరికైనా పొద్దుతిరుగుడు ధాన్యాన్ని అమ్ముకొని… మిగతా పనులు చేసుకునే వాళ్లం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చి కష్టాలు పడుతున్నాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేశారు.
– ముత్యమల్ల కనకయ్య, రైతు, లింగాపూర్, తొగుట మండలం (సిద్దిపేట జిల్లా)
ఏనాడు ఇంత ఇబ్బంది కాలేదు. మారెట్లో ధాన్యం పోసి నెల దాటింది. జిల్లా అధికారులు మొత్తానికే చేతులు ఎత్తేశారు.బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏనాడు ఇంత ఇబ్బంది కాలేదు. ఎప్పుడైనా వరిపంట సాగుచేసేది.. పంట మార్చాలని అధికారులు చెప్పితే ఈసారి పొద్దుతిరుగుడు పంట సాగుచేశా. కానీ ప్రభుత్వం కొనడం లేదు. రూ. 30 వేల పెట్టుబడి పెట్ట్టి పంట పండిస్తే మధ్య దళాలు రూ.6,000 అంటున్నారు. ఇటు ప్రభుత్వం కొనదు అటు మధ్య దళారులు సగం ధరకే కొంటాం అంటున్నారు.
– గూడ మాధవరెడ్డి, రైతు, చిన్నకోడూరు (సిద్దిపేట జిల్లా)