సిద్దిపేట, జనవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సాగుకు సన్నద్ధ్దమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలోని ఘనపూర్(వనదుర్గా ప్రాజెక్టు)కు క్రాప్‌హాలిడే ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. సింగూరు కింద సంగారెడ్డి జిల్లాలో 40 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. సింగూరు నుంచి ఘనపూర్ ఆనకట్టకు వచ్చే నీటితో ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 40 వేల ఎకరాలు సాగవుతుంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సాగు, తాగునీటికి సింగూరు నీటిని వినియోగిస్తారు.
ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ తాగునీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేస్తారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల పేరిట ఈ ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.ఇప్పటికే చాలామంది రైతులు నారుమడులు పోసుకొని దుక్కులు సిద్ధ్దం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో తమ బతుకులు ఏంకావాలి అని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పంటలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు ప్రాజెక్టును రెండేండ్లలో మరమ్మతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ వారు సూచించిన ప్రకారం కట్ట రివిట్ను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో దాదాపు 15 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. 8.5 టీఎంసీల నీటిని నిల్వ చేసి కట్ట రివిట్మెంట్ పనులు ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టులో 5.10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. రెండేండ్లలో పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకోసం రూ. 13.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇటీవల మంజీరా, ఘనపూర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లకు వదిలారు.
మెదక్ జిల్లాలోని ఘనపూర్ (వనదుర్గా ఆనకట్ట) ఆయకట్టు రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని నారుమడులు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. మెదక్ జిల్లాలోమంజీరా నదిపై కొల్చారం-పాపన్నపేట మండలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905లో ఘనపూర్ మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ద్వారా విడతల వారీగా నీటిని విడుదల చేస్తే ఘనపూర్ ఆయకట్టు కింద పంటలు సాగవుతాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు చేపడుతుండడంతో నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో యాసంగి సాగు చేయవద్దని అధికారులు ప్రకటించారు.
ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో మహబూబ్‌నహర్, ఫతేనహర్ రెండు కాల్వలు ఉన్నాయి. దీనికింద ఆయకట్టు 21,625 ఎకరాలు ఉంటుంది. 1) మహబూబ్‌నహర్ కాల్వ ద్వారా కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలు సాగునీరు అందుతుంది. 2) ఫతేనహర్ కాల్వ ద్వారా పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల్లో 10,200 ఎకరాలు సాగవుతుంది.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.స్వయంగా 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ప్రాజెక్టును సందర్శించి అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించారు.
ఆ నిధులతో కాల్వల ఆధునీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టును ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేశారు. సింగూరు ప్రాజెక్టు నీటిని పూర్తిగా మెదక్, నిజామాబాద్ జిల్లాల అవసరాలకే కేసీఆర్ కేటాయించారు. రెండేండ్లుగా సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరిట కాలయాపన చేయడంతో రైతులు రెండు పంటల సాగుకోల్పోయి నష్టపోయా రు. ప్రస్తుతం ఘనపూర్ ఆనకట్ట నుంచి యాసంగికి సాగునీరు విడుదల చేయమని నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. మరి కొంత మంది రైతులు పంటలు సాగు కోసం బోరుబండ్ల వైపు చూస్తున్నారు.
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులతో కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి తిప్పలు తప్పవు. ఈ ప్రాజెక్టు నుంచి మిషన్‌భగీరథ ద్వారా అక్కడి ప్రజలకు తాగునీరు అందుతుంది. వేసవి వచ్చిందంటే ప్రధానంగా జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 21 మండలాల్లోని 819 గ్రామాలకు నీటి ఎద్దడి తప్పదు. సింగూరు ద్వారా తాగునీటికి హైదరాబాద్‌కు 6.96 టీఎంసీలు, మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు 5.70 టీఎంసీల నీటిని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం సింగూరు ఖాళీ చేస్తుండడంతో ప్రజలకు తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొన్నది.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 30 టీఎంసీలు. సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద 1989లో నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. నీటిపారుదల, తాగునీరు, జలవిద్యుత్‌కు సింగూరు వాటర్ వాడకంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో 40 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టు కింద ప్రత్యేక్షంగా పరోక్షంగా మరో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలోని 26 గ్రామాల్లోని 24,057 ఎకరాలు, ఆందోల్ మండలంలోని 12 గ్రామాల్లోని 13,442 ఎకరాలు, మునిపల్లి మండలంలోని ఒక గ్రామంలో 127 ఎకరాలు, సదాశివపేట మండలంలోని ఐదు గ్రామాల్లో 2,372 ఎకరాలు మొత్తంగా సింగూరు ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
సింగూరు ప్రాజెక్టు నీటిని నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తి , హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తారు. బీఆర్ఎస్ హయాం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 21 మండలాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడే ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది లేదంటే నీటి కొరత తప్పదు.
వానకాలంలో అనేక వానలు పడి ఒక్క ఇత్తు చేతికి రాలే. కాలం బాగాఅయ్యింది ఇప్పుడన్నా ఇన్ని ఇత్తులు ఏసుకొని గడ్డకు పడదామంటే కాల్వ ఇడ్వమంటున్నారు. నాకు ఒక్కటే ఎకరం ఉంది. కాల్వ వస్తే మొత్తం నాటేసేటోడిని. ఇగ నీళ్లు రావంటున్నరు. అద్దెకరం మడి ఏసుకుంట. కరెంటన్న సక్కగ ఇస్తరో ఆయింత ఎండవెడ్తరో మరి. పొలం పైసలు ఇస్తలేరు, మందులు ఇస్తలేరు ఏదీ ఇస్తలేరు. సీఎం రేవంత్‌రెడ్డి ఆగం పెడ్తుండ్రు. బీఆర్ఎస్ హయాంలో బాగుండే.
– లక్ష్మయ్య, రైతు,కిష్టాపూర్, కొల్చారం మండలం, మెదక్ జిల్లా
అయిదెకరాల పొలం బీడు ఉంచే కాలం వచ్చింది. గతేడాది, ముందటేడు గుంట ఇడ్వకుంట యాసంగి, వానకాలం మంచిగ పంట పండించుకున్నాం. కాలం బాగానే అయ్యింది. నీళ్లు ఇస్తే అన్ని భూములు పండుతుండే. కాల్వ ఇడ్వమంటున్నరు. ఎవన్ని అడిగెటట్లున్నది. మరి ఏమన్న పరిహారం ఇచ్చి ఆదుకుంటరో, ఎండబెడతరో. కాల్వ ఇడ్వమన్నందుకు పైసలు ఇచ్చి ఆదుకోవాలి.
– శాంతమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్, కొల్చారం మండలం, మెదక్ జిల్లా