రామచంద్రాపురం, ఏప్రిల్ 19: కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మనుషుల స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులను నాశనం చేస్తున్నారు. చెరువుల్లోకి డ్రైనేజీ, రసాయనాలు చేరి కాలుష్యకాసారంగా మారుతున్నాయి. మెజార్టీ చెరువులు డ్రైనేజీ నీటితో కలుషితమయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో మిషన్‌కాకతీయలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేసింది. చెరువుల్లో పూడికతీత, కాల్వల పునరుద్ధరణ, తూములు, అలుగులకు మరమ్మతులు చేసి చెరువులకు పూర్వవైభవం తెచ్చింది.
కాళేశ్వరం నీటితో చెరువులు నింపి తాగు,సాగునీటిని ఇబ్బందులు లేకుండా చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఏగ్రామంలో చూసినా చెరువులు నీటితో కళకళలాడేవి. అర్బన్ ఏరియాలో ఉండే చెరువులు డ్రైనేజీ నీటితో కలుషితం కాకుండా ఎస్టీపీ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చెరువులు తన వైభవాన్ని కోల్పోతున్నాయి. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో చెరువుల గురించి పట్టించుకున్న పాపానపోవడం లేదు. చెరువుల పరిరక్షణను ప్రభుత్వం గాలికివదిలేసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట, కొల్లూర్‌లోని పెద్దచెరువు, పటాన్‌చెరులోని సాకిచెరువు, తిమ్మక్కచెరువు, అమీన్‌పూర్‌లోని పెద్దచెరువు, ఆర్సీపురంలోని రాయసముద్రం, గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం పరిధిలోని పలు చెరువులు డ్రైనేజీ నీటితో పాటు పరిశ్రమల రసాయనాలు చేరి పూర్తిగా కలుషితంగా మారుతున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

కొన్ని చెరువుల్లో కలుషిత నీటి కారణంగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. కొంతకాలం క్రితం గుమ్మడిదలలోని చెరువులో రసాయనాలు కలువడంతో నీరు ఎర్రగా మారి వేలసంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో రైతులు ఆ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు.వారం రోజుల క్రితం తెల్లాపూర్‌లోని చెలికుంటలోకి డ్రైనేజీ నీరు వస్తుండడంతో మురుగు నీటి కారణంగా చేపలకు సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డాయి. ఇలా పలు చెరువులు కలుషితమై చేపలు మృతిచెందడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నప్పటికీ ఆదిశగా అడుగులు వేయడం లేదు. హైదరాబాద్‌లో హైడ్రా ఓ నాలుగైదు చెరువులు బాగుచేసి మొత్తం చెరువులు అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్నది తప్పా క్షేత్రస్థాయిలో చెరువుల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ జరగడం లేదని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
డ్రైనేజీ నీరు చెరువుల్లోకి వెళ్లనివ్వకుండా ప్రత్యేక డ్రైనేజీ పైప్లైన్లతో పాటు అవసరమైతే ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షించాల్సిన అసవరం ఎంతైనా ఉంది.బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట చెరువుల అభివృద్ధి బాధ్యతను పలు నిర్మాణ సంస్థలకు అప్పగించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయా నిర్మాణ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని పలువురు అంటున్నారు. ఈ విషయాన్ని అనుహార్ హోమ్స్ సంస్థకు చెందిన ప్రతినిధి రాజశేఖర్‌రెడ్డి ఎక్స్ వేదికగా గతంలో వెల్లడించారు.
తెల్లాపూర్ పరిధిలో మూడు చెరువులు ఉన్నప్పటికీ డ్రైనేజీ నీరు చేరడంతో కలుషితమవుతున్నాయి. చెలికుంట పూర్తిగా డ్రైనేజీతో నిండడంతో ఇటీవల చేపలు మృతి చెందాయి. తెల్లాపూర్కి ప్రత్యేక డ్రైనేజీ పైప్‌లైన్‌తో పాటు ఎస్టీపీ ఏర్పాటు చేయాలి. తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ 2.0 కింద మంజూరైన రూ.2.09కోట్లతో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు త్వరగా మొదలుపెట్టాలి. చెరువులను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. తెనా ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కోసం శ్రమదానం చేస్తున్నాం.
– ఈశ్వరిగారి రమణ,తెనా అధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా
చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. తెల్లాపూర్ పరిధిలో వందల సంఖ్యలో వెంచర్లు, హైరైస్ బిల్డింగ్లు వెలిశాయి. ఆయా కమ్యూనిటీలకు చెందిన డ్రైనేజీ చెరువుల్లోకి వెళ్తుండడంతో కలుషితమవుతున్నాయి. చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా ఆయా నిర్మాణ సంస్థలు సొంతంగా ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బల్దియా, హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చెరువుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి.
– వడ్డె నర్సింహులు,సాగునీటి సంఘం మాజీ చైర్మన్, సంగారెడ్డి జిల్లా