నంగునూరు, ఏప్రిల్ 25: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నా రు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి వడ్ల కొనుగోలుపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతు లు దళారులకు అమ్ముకుంటున్నట్లు తెలిపా రు.
క్వింటాలుకు మద్దతు ధర రూ.2320 దక్కాల్సి ఉండగా, తక్కువ ధరకు రైతులు ఆమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి ఉందన్నారు. గతేడాది వానకాలంలో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి, కేవలం 52 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ది రైతు కంటక ప్రభు త్వం అని, రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి చేయలేదని, రైతుభరోసా వానకాలంలో ఎగగొట్టి యాసంగిలో మూడు ఎకరాలకే పరిమితం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని, ఎకరాకు రూ.20 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
తక్షణమే కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. పాలమాకుల వడ్ల కొనుగులు కేంద్రంలో వడ్లు కొని వారమైనా ఇంతవరకు రైతులకు డబ్బులు రాలేదన్నారు. మంత్రి ఉత్తమ్ మాత్రం 48 గంటల్లో రైతులకు డబ్బులను అకౌంట్లో వేస్తున్నట్లు చెప్పారన్నారు. గన్నీ బ్యాగులు నాణ్యం గా లేక హమాలీలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట లింగంగౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, కోల రమేశ్, రాగుల సారయ్య, రవీందర్‌రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం పాలమాకులలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు.