రామాయంపేట, జూన్ 18: వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా నూత న బ్రిడ్జిని నిర్మించాలని ఇక్కడి ప్రాంతవాసులు కోరుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జికి గత వానకాలం వరద ప్రభావంతో పగుళ్లు వచ్చి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అధికారులు తాత్కాలికంగా రోడ్డు వేశారు.
ఈ రోడ్డుతో రోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అయి నా ప్రభుత్వం ఇంతవరకు బ్రిడ్జి నిర్మించే ఊసే ఎత్తడం లేదు. రాత్రి పూట అక్కడి నుంచి వెళ్లాలంటే వాహనదారులు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ రోడ్డు మెదక్- ఎల్కతుర్తికి జాతీయ రహదారి. రామాయంపేట, సిద్దిపేటకు ప్రధాన రహదారి. ఈ రోడ్డు గుండా రోజూ వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. భారీ వాహనాలకూ ఇదే రహదారి. తాత్కాలిక రోడ్డు ఏర్పాటుతో లారీలు, ద్విచక్రవాహనాలు, ఆటోలు అదు పు తప్పి కాలువలో పడిన ఘటనలు ఏడాది కాలంగా ఎన్నో జరిగాయి. ప్రజా అవసరాల కోసమైనా ప్రభుత్వం ఈ దారికి మరమ్మతులు చేయాలి. ప్రస్తుతం వానకాలం, అందుకే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఈ దారిలో ఉన్న నందిగామ బ్రిడ్జిని త్వరగా నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.