సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 28: పౌల్ట్రీ రైతులను ప్రోత్సహించాలని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సృష్టించే అపోహలు నమ్మవద్దని, బాగా ఉడకపెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదన్నారు.
70 డిగ్రీల వరకు ఉడకపెడితే ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. గతంలో అపోహలు వస్తే కేసీఆర్‌తో పాటు ప్రజాప్రతినిధులంతా చికెన్ తిని అపోహలను దూరం చేసి ప్రజలకు నమ్మకం కల్పించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటీన్ ఇచ్చేది చికెన్, కోడిగుడ్డు మాత్రమే అన్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలోనే ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పౌల్ట్రీ రైతులకు మక్కలు, విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని హరీశ్‌రావు చెప్పారు.
నర్సాపూర్, ఫిబ్రవరి 28: చికెన్‌ను 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి హాని జరగదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వెన్‌కాబ్ కంపెనీకి చెందిన గోల్డెన్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వాహకుడు, బీఆర్ఎస్ నాయకుడు షేక్ హుస్సేన్ చికెన్ మేళా నిర్వహించారు. చికెన్‌పై అపోహలను తొలిగించడానికి ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిందని, చికెన్ తింటే హాని చేకూరుతుందని ప్రజలు అపోహ చెందుతున్నారని గుర్తుచేశా రు. చికెన్‌ను 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి తిన్నట్లయితే ఎలాంటి హాని జరగదని ప్రజలకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, నాయకులు చికెన్ తిని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు జితేందర్‌రెడ్డి, సేనాధిపతి, రాకేశ్ గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి