నారాయణఖేడ్, డిసెంబర్ 19: బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు పెద్దపీట వేసి, దశలవారీగా రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి తదనుగుణంగా పనులు చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. నిధుల కొరతను సాకుగా చూపుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా పక్కనపెట్టే విధంగా వ్యవహరిస్తున్నది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుంచి మాసాన్‌పల్లి వరకు డబుల్ లేన్ రోడ్డు ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం తొలిదశలో సిర్గాపూర్ వరకు 12 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసి పనులు సైతం ప్రారంభించింది. ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించి అప్పటి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన మేరకు నిధులు మంజూరయ్యాయి.
తదనంతరం ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ రోడ్డు పనులకు బ్రేక్ పడింది. బిల్లులు రావనే భయంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు. ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సదరు కాంట్రాక్టర్‌కు భరోసా కల్పించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇక గ్రామాలకు డబుల్ లేన్ రోడ్డు ఏర్పడి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందనే ఆయా గ్రామాల ప్రజల మురిపెం ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ రోడ్డు ఏర్పాటైన పక్షంలో చాంద్‌ఖాన్‌పల్లి, స్కూల్ తండా, శివారుసందు తండా, మిట్యానాయక్ తండా, తుర్కపల్లి తండా, తుర్కపల్లి, గంగాపూర్, ర్యాకల్, పోతన్‌పల్లి, చల్లగిద్ద తండా, జీవులా తండా, సిర్గాపూర్, లక్ష్మణ్‌నాయక్ తండా తదితర గ్రామాలకు ఈ రోడ్డు సదుపాయం అనువుగా ఉండేది.
కామారెడ్డి జిల్లా పిట్లం వెళ్లేందుకు సైతం ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో ప్రజల ఇబ్బందులను దూరం చేయాలనే సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ రోడ్డు పనులు కాస్త కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని ఆగిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి వాహనాలు నడపడం కష్టతరమై, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను గమనించి ప్రభుత్వం వెంటనే పనులను ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు పనులు నిలిచిపోవడానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అభివృద్ధి పనులకు నిధులు తేవడంలో, పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించే విషయంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపేవారు. ఆ ప్రయత్నాలేవి ఇప్పుడు కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులపై ప్రస్తుత ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లు కనిపిస్తుంది. పనులు ప్రారంభించిన దశలోనే ఆగిపోవడంతో ఈ రూట్లో రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు కల్గుతున్నాయి. బైకులు బోల్తాపడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పనులను ప్రారంభించి ప్రజల ఇబ్బందులు తీర్చాలి.
– రవీందర్‌నాయక్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యుడు, సంగారెడ్డి జిల్లా
ఏడాది క్రితం రోడ్డు పనులు మొదలుపెట్టి ఆపేసిండ్రు. రోడ్డంతా గుంతలు పడి శాన కష్టమైతుంది. ఆటోలు, బస్సులు, సైకిల్ మోటర్లు నడవనికే ఎంతో కష్టమైతుంది. మొదలు పని చేసి తర్వాత పని ఆపేసిండ్రు. మాది తుర్కపల్లి తండా రోడ్డుకే ఉంటది. పెద్ద రోడ్డు ఏస్తున్నరని ఎంతో సంతోసపడ్డం. గని పనులే చేస్తలేరు. ఈ రోడ్డు పోడ్త ఉన్న తండాలు, ఊర్లకు పెద్ద రోడ్డు సౌలత్ అయితదనుకుంటే పనులే సాగ్తలేవు.
– లక్ష్మీబాయి, తుర్కపల్లి తండా, సంగారెడ్డి జిల్లా