రాష్ట్ర బడ్జెట్లో మెతుకుసీమకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధ్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని, ప్రధాన రంగాలైన సాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్య,వైద్యానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని అన్నివర్గాల ప్రజలు ఆశించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మెతుకుసీమకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. మరీ ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు తూతూమంత్రంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. రైతుభరోసా, రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రైతులు ఆశించారు.
ప్రభుత్వం రైతుభరోసా బకాయిలు, రుణమాఫీ బకాయిలు చెల్లించేందుకు నిధులు కేటాయించలేదు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలంగా చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో చోటు ఇవ్వలేదు. సింగూరు ప్రాజెక్టు, నల్లవాగు ప్రాజెక్టుల కొద్దిపాటి నిధులు కేటాయించింది.సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వరం కాల్వలు, రిజర్వాయర్లకు సైతం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. మెదక్ ఘనపురం ప్రాజెక్టు నిర్వహణకు కొద్దిపాటి నిధులు కేటాయించి చేతులు దులుపుకొంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, రిటైర్డు ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి తీపి కబురు చెప్పలేదు. దీంతో బడ్జెట్‌పై అన్నివర్గాలు పెదవి విరుస్తున్నాయి.
సంగారెడ్డి, మార్చి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఉమ్మ డి మెదక్ జిల్లా ప్రజలను తీవ్రంగా నిరాశపర్చింది. ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. మహాలక్ష్మీ పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయం అమలుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు.ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 15 లక్షల వరకు మహిళలు మహాలక్ష్మీ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 4.5 లక్షల మంది రైతులు ఉంటారు. వీరందరికీ ప్రభుత్వం రైతుభరోసా కింద ఒక్కొక్కరికి రూ.18వేలు బకాయి ఉంది.
రైతుభరోసా బకాయిల చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 50వేల మంది వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బులు పెరుగుతాయని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వీరి పింఛన్ పెంచలేదు. అభయహస్తం పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎలాంటి తీపికబురు చెప్పలేదు. జిల్లాలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూస్తున్నారు.

నిరుద్యోగులు ఊహించిన ప్రకటనలు ఏవీ బడ్జెట్లో చేయలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు డీఏ పెంపు, పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ రెండూ ప్రకటించలేదు. రిటైర్డు ఉద్యోగులు పింఛన్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంతో బడ్జెట్‌పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 8.22 శాతం నిధులు మాత్రమే కేటాయించడంతో అందరూ నిరాశ చెందారు.
సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యమైన మెట్రో విస్తరణపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ మెట్రో విస్తరణకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించింది. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలని కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు ప్రభుత్వం కేవలం రూ. 95 కోట్లు మాత్రమే నిధులు కేటాయించింది. నిమ్జ్ భూసేకరణకు అవసరమైన నిధులు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవు.
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి రంగానికి పెద్దగా నిధులు కేటాయించలేదు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి నిధులు బడ్జెట్లో కేటాయించలేదు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.
సింగూరు ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనుల కోసం నీటిపారుదల శాఖ రూ.168కోట్లతో ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.45.39 కోట్ల నిధులు కేటాయించింది. నల్లవాగు ప్రాజెక్టుకు రూ. 4.51 కోట్లు మాత్రమే కేటాయించింది. మెదక్ జిల్లాలోని ఘనపురం ప్రాజెక్టు ఫతేనహర్ కాల్వ నిర్వహణకు రూ.20.50 లక్షల నిధులు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద సిద్దిపేట, మెదక్ జిల్లాలోని కాల్వల ఆధునీకరణ, పెండింగ్ కాల్వల పనులు, సంగారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, మార్చి 20: ప్రజల ఆశలు, ఆక్షాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చింది. రైతులు, యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఎలాంటి కేటాయింపులు లేవు. పథకాలు కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి. హామీల అమలు చేసేలా బడ్జెట్ లేదు. పంట రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై బడ్జెట్లో స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించి. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు తగినన్ని నిధులు కేటాయించలేదు. బసవేశ్వర, సంగమేశ్వర్ ఎత్తిపోతలు, సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణ ప్రస్తావన లేకుండా సంగారెడ్డి జిల్లాను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
నర్సాపూర్,మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమీ లేదని ఒట్టి డొల్ల అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. గెలిచిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నేడు బడ్జెట్లో మొండిచేయి చూపించారన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని గుర్తుచేశారు.
మహిళలకు ఇస్తానన్న రూ.2500 గురించి బడ్జెట్లో ఊసేలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి సంవత్సరం రూ.20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండపడ్డారు. ప్రతి కులానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో బడ్జెట్ కేటాయించి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక్కరికీ లబ్ది అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ తరపున పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, మార్చి 20: రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీలా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేసిం ది. సంక్షేమ రంగానికి తూట్లుపొడిచింది. ఆరు గ్యారెంటీల అమలును పూర్తిగా గాలికి వదిలేసింది. సింగూ రు ప్రాజెక్టు అభివృద్ధికి కేవలం రూ. 44.88 కోట్లు మంజూరు చేయడం ఏమాత్రం సరిపోవు. సంగమేశ్వర, బసవేశ్వర, నారింజ ప్రాజెక్టులకు నిధులు కేటాయిక పోవడం బాధాకరం. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు సాధన జిల్లావాసుల చిరకాల కోరికగా మిగిలిపోనున్నది. 100 పడకల ఈఎస్ఐ దవాఖానను ఆధునీకరించేందుకు నిధులివ్వలేదు.
– జయరాజు, సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
రామచంద్రాపురం, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సార్వత్రిక విద్యాసాధన లక్ష్యానికి దూరంగా బడ్జెట్ ఉంది. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో విద్యకు 15శాతం కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ మేరకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. గతేడాది 7.6 శాతం రూ.23.108 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. ఈసారి 8.3శాతం రూ. 26,674 కోట్లు కేటాయించారు. ఇది కేవలం అంకెల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే. మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్షణకు బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. జాతీయ విద్యా కమిషన్ సిఫారసు చేసిన విధంగా బడ్జెట్లో 10శాతం లేదా జీడీపీలో 6శాతం కేటాయింపులు అందనంత దూరంలో ప్రస్తుత కేటాయింపులు జరిగాయి.
– శ్రీనివాస్ రాథోడ్, ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు (సంగారెడ్డి)
హత్నూర, మార్చి 20: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను నిరాశ పరిచేలా బడ్జెట్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏ, ఉద్యోగ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం. సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల రెగ్యులర్ గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వం పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, బకాయిల గురించి స్పష్టత ఇవ్వాలి.
– ఆకుల ప్రభాకర్, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి