పటాన్చెరు టౌన్, జూలై 15 : కాంగ్రెస్ సర్కారు మోసాలకు చిరునామాగా మారిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియం నుంచి యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని, అదే స్టేడియం నుంచి ప్రశ్నించేందుకు ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువ సంగ్రామ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి 5వేల మంది యువత హాజరవుతారని ఎమ్మెల్యే వెల్లడించారు. బుధవారం పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సదస్సు వివరాలు వెల్లడించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా హామీని నేటికి నిలబెట్టుకోలేదన్నారు. నిరుద్యోగ యువతను, రైతులను, మహిళలను, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నియామకాల్లో జాప్యంతో ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లు, ఐదు మున్సిపాలిటీలు, రెండు మండలాల నుంచి ఐదు వేల మంది యువత సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు నింపని అర్హులైన ప్రతి ఓటరును కలిసి దరఖాస్తులు నింపేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఎస్ఐఆర్పై చైతన్యం కోసం మసీద్‌లు, చర్చిల వద్ద అవగాహన కల్పిస్తామన్నారు. కాలనీలు, గ్రామాల్లో ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఎస్ఐఆర్ అంశంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని పార్టీ నాయకులకు సూచించారు.
అనంతరం పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకటేశంగౌడ్, గోవర్దన్‌రెడ్డి, యువనేతలు మేరాజ్‌ఖాన్, చెన్నారెడ్డి యువ సంగ్రామ సదస్సు, ఎస్ఐఆర్పై మాట్లాడారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, జిల్లా, నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.