సిద్దిపేట, సెప్టెంబర్ 25: బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో పూలను పూజించే గొప్ప పండుగ, సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను తగ్గిస్తున్నదని మండిపడ్డారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాట్లు చేయకపోవడంతో ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చెరువుల వద్ద చెట్ల పొదలను, గడ్డిని తొలిగించి, బతుకమ్మ మెట్లకు పెయింటింగ్స్ వేయించేవారని, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా నిర్వహించి బతుకమ్మ ఉత్సవాలు పదేండ్ల పాటు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. చెరువుల వెళ్లే దారిలో రోడ్ల మరమ్మతులు చేశామని, ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారని, పారిశుధ్య నిర్వహణ లోపంతో ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
సర్పంచ్‌లు లేక, జీపీలకు నిధులు రాక పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య నిర్వహణ చేయలేక పోతున్నారని తెలిపారు. నాలుగు నెలలుగా గ్యాస్ సిలిండర్‌కు ఇచ్చే డబ్బులు రావడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఉత్తవైనట్లు తెలిపారు. అన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ను ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.