సంగారెడ్డి, జూన్ 6(నమస్తే తెలంగాణ) : పరిశ్రమల ఏర్పాటు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములు కాజేసేందుకు యత్నిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ‘ఫార్మాసిటీ’ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2వేల పైచిలుకు ఎకరాల అసైన్డ్, పట్టా భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది.
దీనికి భూములు ఇవ్వమంటూ రైతులు తిరగబడ్డారు. ఇదే తరహాలో గుమ్మడిదలలో ఇండస్ట్రియల్ పార్కు కోసం 157 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, ఇక్కడి రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రభుత్వం అడ్డగోలు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి తిరగబడుతున్నప్పటికీ రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కంది మండలం చెర్యాల్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం దళితులు, గిరిజనులు, బీసీలకు ఇచ్చిన 120 ఎకరాల అసైన్డ్ భూముల సేకరణకు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.
చెర్యాల్ గ్రామంలోని 741, 741/1 సర్వే నెంబర్లలోని వంద మందికిపైగా రైతులకు చెందిన అసైన్డ్ భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరుతో ప్రభుత్వం పంటలు పండే భూములు సేకరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేదిలేదంటూ దళిత,గిరిజన రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం భూసేకరణపై మొండిగా ముందుకు వెళ్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అప్పనంగా కొట్టేసేందుకు కాంగ్రెస్ తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెర్యాల్ గ్రామంలో ప్రతిపాదిత 741 సర్వే నెంబర్లో 340 ఎకరాలకుపైగా ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉంది. 1965 నుంచి 1970 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం చెర్యాల్కు చెందిన భూములు లేని దళితులు, గిరిజన, బీసీలకు ఎకరం నుంచి రెండు ఎకరాల చొప్పున అసైన్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన 740, 741 సర్వే నెంబర్లలోని 120.16 ఎకరాల వందకు పైగా దళిత, గిరిజన, బీసీ కుటుంబాలకు చెందిన రైతులు పంటలు సాగుచేస్తూ జీవిస్తున్నారు.
అసైన్డ్ భూములు పొందిన రైతుల్లో కొంతమంది మరణించగా, ఆ భూములు వారి వారసుల పేరిట కొనసాగుతున్నాయి. కొంత మంది రైతులు ఇంకా జీవించి ఉన్నారు. ఈ భూములు హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారి పక్కన, ఐఐటీహెచ్కు సమీపంలో ఉంటాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఈప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ఎకరం భూమి విలువ కోట్ల రూపాయలు పలుకున్నది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో పట్టు ఉన్న ఓ కీలక నేత కన్ను చెర్యాల భూములపై పడిందని స్థానికులు చెబుతున్నారు. ఎలాగైనా అసైన్డ్ భూములను చేజిక్కించుకునేందుకు ‘ఇండస్ట్రియల్పార్కు’ పేరుతో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇండస్ట్రియల్పార్కు కోసం అంటూ 120 ఎకరాల భూసేకరణ చేపడతారు. ఇలా సేకరించిన భూములను టీజీఐఐసీ బదలాయిస్తారు. టీజీఐఐసీ ఈ భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు విక్రయిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేతకు చెర్యాల్లోని 120 ఎకరాల భూములను తక్కువ ధరకు అప్పగించేందుకు ఇండిస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 741 సర్వే నెంబర్లోని అసైన్డ్ భూములు ఉన్న దళిత, గిరిజన, బీసీ రైతులు భూములు అప్పగించేలా చెర్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు అప్పుడే బేరసారాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది.
అసైన్డ్ భూములు తిరిగి అప్పగించినందుకు ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.60 లక్షలు, ఇంటి స్థలం ఇప్పిస్తామని ప్రైవేటుగా మరో రూ.30 లక్షలు ఇప్పిస్తామని అసైన్డ్భూములు ఉన్న రైతులకు ఆశచూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్భూముల్లో ఏండ్లుగా పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నామని, ఆ భూములను తిరిగి ఇవ్వమని రైతులు ఖరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. ఎకరం రూ.5 నుంచి రూ.7 కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం నామమాత్రంగా ఇచ్చే పరిహారం డబ్బుల కోసం వదులుకోమని రైతులు తమవద్దకు వచ్చిన మధ్యవర్తులకు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగితే ఆందోళన చేస్తామని రైతులు చెబుతున్నారు.
కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణం గా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెల లు, సంవత్సరాలు సమయం తీసుకునే రెవెన్యూ అధికారులు, చేర్యాల భూసేకరణ విషయంలో తక్షణమే రంగంలోకి దిగారు. చేర్యాల ఇండస్ట్రియల్ పార్కు కోసం 120.16 ఎకరాల భూసేకరణకు గురువారం ఉదయం సంగారెడ్డి కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారో లేదో సాయంత్రం కంది తహసీల్దార్ అసైన్డ్ భూముల రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన భూములను వెంటనే అప్పగించాలని తహసీల్దార్ రైతులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం నిబంధనల మేరకు భూములకు నష్టపరిహారం ఇస్తామని, వెంటనే అంగీకరించి భూములు స్వచ్ఛందంగా అప్పగించాలని , లేదంటే బలవంతంగా భూము లు లాక్కోవాల్సి వస్తుందని తహశీల్దార్ రైతులను హెచ్చరించినట్లు సమాచారం. సోమవారం 741 సర్వే నెంబర్లోని అసైన్డ్భూములు వద్దకు వస్తామని, అక్కడే భూములు కొలిచి స్వాధీనం చేసుకుంటామని, ఎవ్వరూ గొడవలు చేయవద్దని తహశీల్దార్ రైతులను భయభ్రాంతులు గురిచేసినట్లు తెలిసింది.
అయితే ఈ సందర్బంగా రైతులు తహసీల్దార్ వ్యవహారశైలిని తప్పుబట్టడంతోపాటు బెదిరింపులకు తాము తలొగ్గమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం తప్పనిసరిగా అసైన్డ్భూములు స్వాధీనం చేసుకోవాలంటే ఎకరాకు రూ.5 నుంచి రూ.7 కోట్లు చెల్లించాలని, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అప్పుడే భూములు ఇస్తామని రైతులు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. రైతులతో సమావేశంపై కంది తహసీల్దార్ రవికుమార్ వివరణ కోరగా.. చేర్యాల్లో ఇండస్ట్రియల్పార్కు ఏర్పాటుకు అవసరమైన 120.16 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
రైతులతో సమావేశం నిర్వహించలేదని, రైతులే తన వద్దకు వచ్చినట్లు చెప్పారు. రైతులను భూములు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు. రైతులు మాత్రం తమకు ఎకరాకు రూ.5 కోట్లు పరిహారం ఇస్తేనే భూములు అప్పగిస్తామని వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. సోమవారం చేర్యాల గ్రామంలో రైతులతో భూసేకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.