సిద్దిపేట, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, రౌడీ రాజకీయం చేస్తున్నది. ప్రశ్నిస్తే రేవంత్ సర్కారు వేధింపులకు గురిచేస్తున్నది. ప్రజలే కాకుండా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. గజ్వేల్, సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరుగ్యారెంటీలు, హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వారిని రేవంత్ సర్కారు టార్గెట్ చేస్తున్నది.
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోలీసులు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా రాజకీయపరంగా వారి పార్టీలకు అనుగుణంగా నడుచుకున్నారు. వారి వారి పార్టీ సిద్ధ్దాంతాలను చెప్పుకొన్నారు. కానీ, దాడుల సంస్కృతిని ఏ పార్టీ వారు ప్రోత్సహించలేదు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాకనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలపై దాడులు చేయించడం అంటే ప్రజల ఆస్తులపై దాడులు చేయించడమే కదా…?ఇలాంటి దాడుల సంస్కృతి ఉమ్మడి మెదక్ జిల్లాలో లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల నంగునూరు మండలం నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు, శాసనసభలో మాట్లాడిన తీరుతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
గూండాల్లా దాడులకు దిగుతున్నారు.వీరిని నిలువరించాల్సిన పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆయనకు అధికార నివాసం, ఇక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు, ప్రజలను కలుసుకోవడం జరుగుతుంటాయి. ఏపార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ నేతలు ఫొటోలు పెట్టుకుంటారు. కానీ, అక్కడ సీఎం ఫొటో పెట్టాలి అనే నిబంధన ఎక్కడా లేదు. అక్కడి ఎమ్మెల్యే ఇష్టాఇష్టాలపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. సీఎం ఫొటో పెట్టలేదని దాడులకు దిగడం ఎంత వరకు కరెక్టో కాంగ్రెస్ నేతలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి..ప్రభుత్వ ఆస్తిపైనే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటి. తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్ష నేత, తెలంగాణ ప్రదాత అధికార క్యాంప్ కార్యాలయానికి రక్షణ లేకపోతే ఎలా ..? ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటీ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ అనేది ఉన్నట్టా..? లేనట్టా..? ఉంటే ఏమైనట్లు ..? పోలీస్ వ్యవస్థ ఏమైనట్టు అని నియోజకర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తారనే సమాచారం ముందే పోలీసులుకు తెలిసిన సైలెంట్‌గా ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుననది.
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనలో పూర్తిగా పోలీసుల వైఫల్యం కొట్ట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. అంతా తెలిసి కూడా పోలీసులు పూర్తిగా అలసత్వం ప్రదర్శించినట్లు అర్ధమవుతున్నది. జరగాల్సిన దాడి జరిగాక హడావిడి చేయడం తప్ప మరోటి లేదని బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నారు. దాడి చేసిన గూండాలను గుర్తించి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. పోలీసుల మాత్రం చోద్యం చూస్తున్నారు. మూడు రోజలు కిందట సిద్దిపేట క్యాంప్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అక్కడ ఇది రెండోసారి, గత ఏడాది నర్సాపూర్ ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంపై సైతం కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికారిక క్యాంప్ కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు.
మూడు రోజుల కిందట సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తారని ముందే గ్రహించిన బీఆర్ఎస్ నాయకులు క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ దాడి చేద్దామనుకున్న కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు. శనివారం గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగారు.గ్రామసభల్లో ప్రజలు నిలదీతలతో ఏం చేయాలో పాలుపోక ఇలాంటి దాడులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగుతున్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నారు.