మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 10 : హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు,మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి తదితరులతో కలిసి ఆమె విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు.
ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు. హౌస్ అరెస్ట్‌లు చేస్తే బీఆర్ఎస్ బయపడదని, ఎన్ని అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా, కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ అబద్ధ్దపు హామీలను గుర్తు చేయడానికే బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం అని విమర్శించారు. బాకీ కార్డే కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతుందన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులోని వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారన్నారు. మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందే కేసీఆర్ పదే పదే చెప్పారని పద్మాదేవేందర్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ రోజు అదే నిజమైందన్నారు. ఎకరానికి రూ.1500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏమైందన్నారు. రూ.2 లక్షల పంటరుణ మాఫీ ఊసేలేదన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామమని చేతులెత్తేశారని, ఇవ్వన్నీ బాకీ కాదా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
2 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4వేల భృతి ఏమైందన్నారు. ఈ మోసాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందని మండిపడ్డారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం హామీ ఏమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, ప్రభురెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీనివాస్, మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు అంజాగౌడ్, ఉదయ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, ఎలక్షన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సాంబశివరావు, ప్రభాకర్, బాలయ్య, మోహన్, శ్రీనివాస్‌గౌడ్, కిష్టయ్య, ఇస్మాయిల్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.