చేర్యాల, ఆగస్టు 14 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో జనగామ ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డివిజన్ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని జేఏసీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వకులాభరణం నర్సయ్యపంతులు అన్నారు.
డివిజన్ సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గురువారం మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట, చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపురి, శభాష్‌గూడెం గ్రామాల్లో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు డివిజన్ కోసం చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి భువనగిరి ఎంపీగా పని చేసిన సమయంలో చేర్యాలలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని తమ ప్రభుత్వం రాగానే డివిజన్ చేయిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో తాను ఎంపీగా విజయం సాధిస్తే వెంటనే డివిజన్ చేయిస్తానని హామీ ఇచ్చి భువనగిరి ఎంపీగా విజయం సాధించిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం డివిజన్ ఏర్పాటు విషయంలో ముఖం చాటేసినట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా చేర్యాల ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు.డివిజన్ కేంద్రం ఏర్పాటు విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రానున్న స్థానిక ఎన్నికల్లో ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.ర్యాలీలో నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఆముదాల మల్లారెడ్డి, వడ్లకొండ సంజీవులు, పుర్మ నారాయణరెడ్డి, భూమిగారి రాజేందర్, వుల్లంపల్లి కరుణాకర్, వెంకట్‌మావో, తిరుపతిరెడ్డి, సుంకరి మల్లేశం, సత్తిరెడ్డి, మలిపెద్ది మల్లేశం, మేక సంతోష్, సిద్దప్ప, పాండు, ప్రవీణ్, మానస, శ్రీహరి, కొండయ్య పాల్గొన్నారు.