దుబ్బాక, జనవరి 26: గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు దుశ్చర్యకు ఒడిగట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడులకు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను టార్గెట్ చేసి అలజడి సృష్టించారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. వేడుకలో ఉన్న విద్యార్థులను తోసుకుంటూ మరీ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే ప్రసంగాన్ని కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకుల అడ్డగింపులను లెక్క చేయకుండా ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడి నుంచి వంద పడకల దవాఖానలో ఎమ్మెల్యే జెండా వందనం కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో మరోసారి కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు నిలువరించలేక ప్రేక్షకపాత్ర పోషించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు దాటిన నయా పైసా అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా అడ్డంకిగా మారిందన్నారు. రెండేండ్లలో దుబ్బాక మున్సిపల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ జెండాకు అగౌరవం…
దుబ్బాక గాంధీ వ్రిగహం వద్ద మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన జెండావిష్కరణలో అపశుత్రి చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే జెండావిష్కరణలో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది తప్పిదం వల్ల జాతీయ జెండా తలకిందులుగా ఎగురవేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ మున్సిపల్ సిబ్బంది తప్పిదాన్ని ఎమ్మెల్యేపై రుద్దుతూ సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దుబ్బాక పీఎస్‌లో ఫిర్యాదు చేయడం విడ్డూరం.