చేర్యాల, జనవరి 31: బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో దాడులు నిర్వహించి నిందితుడు రాకేశ్‌కుమార్‌ను పట్టుకున్నారు. బుధవారం ఎక్సైజ్ సీఐ మహేంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ బీహార్ రాష్ర్టానికి చెందిన రాకేశ్‌కుమార్ కొంతకాలంగా చేర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి చేర్యాలలో విక్రయిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్లు రూపంలో ఉన్న గంజాయిని నిందితుడు ఈ ప్రాంతంలో పనులు చేసే బీహార్ కార్మికులకు ఎక్కువగా విక్రయించేవాడు.
పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడి నుంచి 30 ప్యాకెట్లలో 6 కిలోల బరువు గల 1200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్సైలు టి.వినోద్‌కుమార్, పి.సురేశ్, సిబ్బంది ఫరీద్, రవి, స్వామి, నర్సింహులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.