సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్, రాజర్షి షా వేర్వేరుగా అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాలను వారు ఆయా కలెక్టరేట్లలో నిర్వహించారు. సంగారెడ్డిలో 32 అర్జీలు అందాయి. ఆయా అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో 15 అర్జీలు రెవెన్యూశాఖకు సంబంధించినవి కాగా, మిగతా శాఖలకు చెందిన 17 అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో తమ శాఖకు వచ్చిన అర్జీలు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వివరాలను సంబంధిత రిజిష్టర్లలో అప్డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నారాయణఖేడ్, సంగారెడ్డి ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్‌లో 113 వినతులు
మెదక్ కలెక్టరేట్లో డీఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి 113 వినతులను స్వీకరించారు. ఆయా వినతుల్లో ప్రధానంగా ధరణి, భూసమస్యలు, భూసర్వే, ఫౌతి, ఆస్తి తగాదాలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినవి కాగా, పంట రుణాలు, వైద్యారోగ్యం, మున్సిపల్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి వినతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పిల్లాకోటాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని మెదక్ మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు. భూ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల తహసీల్దార్లకు పంపుతూ సమగ్ర నివేదికలు తెప్పించాలని కలెక్టర్ కలెక్టరేట్ ఏవో యూనుస్‌కు సూచించారు. ప్రజావాణికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్నందున ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం అధిగమించాలన్నారు. కంటి వెలుగు శిబిరాలను సందర్శించి ప్రతిరోజు 150 మందికి తగ్గకుండా కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు మహిళలు అధిక సంఖ్యలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రహదారుల వెంట పలు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో వేగవంతం చేయాలన్నారు. పిల్లల్లో గ్రోత్ మానిటరింగ్ చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సాయిబాబ, రవిప్రసాద్, నాగరాజు, బ్రహ్మాజి, ఇందిర, ఆశాకుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.