నమస్తే తెలంగాణ నెట్వర్క్ , నవంబర్ 27 : గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయి. ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలివిడత ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. గురువారం 75 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట, శంకరంపేట (ఏ) మొత్తం 160 గ్రామ పంచాయతీలు, 1402 వార్డులకు జరుగుతాయి.
వీటిలో 160 సర్పంచ్ స్థానాలకు గాను 55 నామినేషన్లు దాఖలు కాగా, 1402 వార్డు స్థానాలకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏదేని ఫిర్యాదులకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 93919 42254 నంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లోని 136 జీపీలు, 1246 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతలో 459 గ్రామ పంచాయతీలు, 4080 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు దాఖలు కాగా వార్డు మెంబర్ స్థానాలకు 149 నామినేషన్లు దాఖలు అయ్యాయి