చేర్యాల, నవంబర్ 15: సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యా ణం, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం, ఆలయ వర్గాలను కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణం, బ్రహ్మోత్సవాలపై శనివారం సిద్దిపేట కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14, జనవరి 18, 2026 నుంచి 16 మార్చి వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరిగే జాతరకు వేలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి మేడారం జాతర ఉన్నందున్న అక్కడికే వెళ్లే భక్తులు కొమురవెల్లిలో దర్శనం చేసుకోవడం ఆనవాయితీ కావడంతో భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉండే అవకాశం ఉందన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని, బారికేడ్లు ఏర్పాటు చేసి రద్దీని కంట్రోల్ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బందోబస్తు పటిష్టం చేయాలని పోలీస్‌శాఖకు కలెక్టర్ హైమావతి సూచించారు.లడ్డూ కౌంటర్లు పెంచాలని, క్యూలైన్ ద్వారా భక్తులకు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయాలని, విధులు నిర్వహించే వారికి సైతం భోజన వసతి ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని, శాశ్వత మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. విద్యుత్ లైన్లను ముందస్తుగా మరమ్మతులు చేయాలని, అదనపు ట్రాన్స్పార్మర్లు సమకూర్చుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్ధం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని షిప్ట్ ల్లో 24గంటలు అందుబాటులో ఉంచాలన్నా రు.
అవసరమైన మందులు, అంబులెన్స్‌ను సిద్ధ్దంగా ఉంచుకోవాలని సూచించారు. ఆల య పరిసకరాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శానిటేషన్ సిబ్బందిని నియమించుకొని మూడు షిప్ట్‌ల్లో పనులు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.మద్యం అమ్మకాలు జరగకుండా చర్య లు చేపట్టాలని, ఆర్టీసీ బస్సులు రూట్ల వారీగా నడపాలని, నిర్ధేశిత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు సిద్ధ్దంగా ఉంచుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, ఆలయ డీసీ టంకశాల వెంకటేశ్, చేర్యాల సీఐ శ్రీను, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్ ధన్‌రాజ్, డీపీవో విజయ్‌కుమార్, విద్యుత్, ఆర్‌డబ్ల్ల్యూఎస్, ఆర్టీసీ, ఆర్అండ్బీ, అగ్నిమాపక, పీఆర్శాఖల అధికారులు పాల్గొన్నారు.