కంది, అక్టోబర్ 3: డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలన్నారు. మండలంలోని తోపుగొండ గ్రామంలో చేపట్టిన సర్వేను గురువారం ఆమె పర్యవేక్షించారు. ఇంటి నంబర్, చిరునామా, కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యులకు యజమానితో ఉన్న సంబంధం వంటి వివరాలు నమోదు చేయాలన్నారు.
సర్వే ప్రక్రియను తహసీల్దార్, ఆర్డీఓ, సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. డిజిటల్ కార్డుల సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలు సమర్థవంతంగా అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కంది తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.