సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 8: జిల్లాలోని దివ్యాంగులకు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం హర్షించదగిన విషయమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధ్దుల సం క్షేమ శాఖ, జిల్లా ఉపాధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ జాబ్‌మేళా ద్వారా జిల్లాలోని వివిధ కార్పొరేట్ కంపెనీ ల్లో వారి అర్హతల మేరకు ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జాబ్‌మేళాలో 32 కంపెనీలు పాల్గొన్నాయని, 200 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన జాబ్‌మేళాకు మొత్తం 156 మంది దివ్యాంగులు హాజరయ్యారని పేర్కొన్నారు. అందులో 57 మంది షార్ట్ లిస్ట్ కాగా, ఎనిమిది మందికి నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. జిల్లాలో దాదాపు 5 వేల పరిశ్రమలు ఉన్నాయని, వచ్చే జాబ్‌మేళాలో అన్ని కంపెనీలు పాల్గొనేలా కృషిచేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధ్దుల సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి, జిల్లా ఉపాధి శాఖ అధికారి అనిల్ కుమారి, యూత్‌ఫర్ జాబ్స్ మేనేజర్ అశ్విన్, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదిత రులు పాల్గొన్నారు.