సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 11: రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఈనెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతుభరోసా పథకం కింద అర్హులను క్షేత్ర స్థాయిలో గుర్తించాలన్నారు.
మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ, రెవెన్యూ అధికారులతో కమిటీలను నియమించుకొని విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్ధారించాలన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో వివరాలను వెల్లడిస్తూ, గ్రామసభ ఆమోదం పొందిన మీదట సంబంధిత పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు.
సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలను అందించేందుకు జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2023-24 సంవత్సరంలో కనీసం 20రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలు ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని సూచించారు. రేషన్ కార్డుల జారీ విషయంలోనూ క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ జ్యోతి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, హజింగ్ పీడీ, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.