అందోల్, ఏప్రిల్ 19: ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వ్యాధులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నదని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి, వైద్య సేవలపై ఆరా తీశారు. బాలింత మమతతో మాట్లాడుతూ కాన్పు నార్మల్ చేశారా? సిజేరియనా.. పాపా.. బాబా? కేసీఆర్ కిట్టు ఇచ్చారా.. వైద్యం ఎలా వుం ది?డాక్టర్లు, నర్సులు, సిబ్బంది బాగా చూస్తున్నా రా? భోజనం రుచికరంగా పెడుతున్నారా… అని అడుగగా.. భోజనం బాగుంది.. వైద్యులు సిబ్బంది బాగా చూసుకుంటున్నారు. బాబు పుట్టాడు.. కేసీఆర్ కిట్టు కూడా ఇచ్చారు బాబు ఉమ్మ నీరు మింగడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు పంపించారని ఆమె సమాధానం చెప్పింది. దీంతో వెంటనే కలెక్టర్ సంగారెడ్డి దవాఖాన జీజీహెచ్ డాక్టర్ అనిల్‌కుమార్‌కు ఫోన్ చేసి బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాబుకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
దవాఖానలో పారిశుద్ధ్య లోపంతో సంబంధిత కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దవాఖానలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నదని, ఇలాగేనా పరిసరాలు ఉంచేది అంటూ మండిపడ్డారు. పారిశుద్ధ్య విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, ఇకపై ఎక్కడా ఇలా కనిపించినా తొలిగిస్తామని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో పర్యవేక్షణ ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌కు సూచించారు. తాగునీటి ఇబ్బందిని రోగులు కలెక్టర్ దృష్టి కి తీసుకురాగా, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అందోల్- జోగిపేట ఆర్డీవో కార్యాలయంలో పీఆ ర్, మిషన్ భగీరథ, హెల్త్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారితో చర్చించారు. అందోల్- జోగిపేటలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడురూం ఇండ్లలో నీటి సమస్య లేకుండా చూడాలని, ఇతర పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ తదితరులున్నారు.