సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నికల అధికారులు భద్రపర్చారు. సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శరత్ గీతంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలను శుక్రవారం పరిశీలించి భద్రతా బలగాలతో మాట్లాడారు.ఎవరినీ అనుమతించకుండా భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా రికార్డు మెయింటెనెన్స్ చేయాలన్నారు. ఆదివారం లెక్కింపు రోజు ఈవీఎంలను బయటకు
తీస్తామని చెప్పారు.
పటాన్చెరు, డిసెంబర్ 1: పటాన్చెరు మండలం రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను ఎన్నికల అధికారులు భద్రపరిచారు. గురువారం పోలింగ్ అనంతరం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి ఈవీఎంలను అధికారులు రుద్రారంలోని గీతం స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఆయా ఈవీఎంలను నియోజకవర్గాలవారీగా పెద్దహాల్స్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలను సీల్ చేశారు. వాటి ముందు ప్రత్యేక పోలీసు బలగాలతో కాపలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శరత్ గీతంలో ఏర్పాటు చేసిన అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూంలను పరిశీలించారు.
స్ట్రాంగ్‌రూంలకు కాపాలాగా ఉన్న భద్రత బలగాలతో మాట్లాడారు. నిబంధనల మేరకు ఎవరినీ రాకుండా చూడాలని సూచించారు. సీసీ కెమెరాలున్న స్ట్రాంగ్ రూంల వీడియోలు చూసేందుకు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ డిస్లే రూమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాటితో పాటు మీడియాకు సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం చెప్పినట్లుగా వ్యవహరించాలని ఆర్వోలకు ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా రికార్డులను మెయింటైన్ చేయాలని కోరారు. భద్రతా చర్యలు పకడ్బందీగా ఉన్నాయన్నారు. ఆదివారం ఈవీఎంలను బయటకు తీస్తారు. లెక్కింపు కూడా అదే రోజు ఉంటుంది. ఈ మేరకు అధికారులు తదుపరి కార్యాచరణను అంచల వారీగా చేస్తున్నారు.