మెదక్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికలకు సన్న ద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.
నూతన వార్డుల ఏర్పాటు, వార్డుల విభజన, జనాభా, లింగని ష్పత్తి ప్రాతిపదికన రికార్డు చేయాలన్నారు. రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గ్రామ, మండల స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించుకోవాలని సూచించారు. సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీవోలు, ఎంపీడీవోలు, ఆపరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించి దేశానికి సేవచేసిన ప్రముఖులను స్మరించుకోవాలన్నారు.
అధికారులు సమన్వయంతో బారికేడ్, పారింగ్ వేదిక ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. మెదక్ పట్టణం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆహ్వాన పత్రికలు ముద్రించి అతిథులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.