మెదక్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్ దరఖాస్తులను పరిషరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.
గ్రీవెన్స్ దరఖాస్తులకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తూ… సత్వర పరిషారం చూపాలని సూచించారు. ప్రతివారం వచ్చే వినతులను ఎప్పటికప్పుడు ఆయా దరఖాస్తులను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలించి ప్రజల సమస్యలను పరిషరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిషారం అయ్యేలా చూడాలన్నారు. ప్రజావాణిలో 34 దరఖాస్తులు స్వీకరించామని, అందులో ధరణి-16, పెన్షన్ -3, ఉపాధి- 2, ఇతర సమస్యలు-13 వచ్చాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీసీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 25: ప్రజావాణి సమస్యలను అధికారులు ప్రత్యేక చొరవ చూపి సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వ్యయప్రయాలకోర్చి వస్తారని, అధికారులు శాఖలవారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతోపాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లకు సంబంధించి 62 దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 25: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాధులను అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ప్రజావాణిలో 60 అర్జీలు అం దాయి. చౌటకూర్ గ్రామస్తులు అర్జీని అందజేస్తూ కొత్తగా ఏర్పడిన మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పద్మజారాణి, పరమేశ్, అధికారులు పాల్గొన్నారు.