మెదక్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ చాంబర్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి సివిల్ సప్లయ్ మారెటింగ్, వ్యవసాయ, సహకారశాఖ, డీఆర్డీఏ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోప్రస్తుతం వాతావరణ అనుకూల ప్రభావంగా ఉన్నందున కొనుగోలు వేగం పెంచి రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు.
69 రైస్‌మిల్లుల వద్ద ఒక రెవెన్యూ ఆఫీసర్‌ను నియమించి లారీల దిగుమతి పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ తయారు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం స్టాక్ ఉన్న టార్పాలిన్ వివరాలను సమగ్ర సమాచారంతో ఫార్మాట్ రూపొందించాలన్నారు. కేంద్రాల వద్ద హమాలీలను పెంచి వేగంగా కొనుగోలు చేయాలని సూచించారు. ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్న మండలాల్లో రైతులు ధాన్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా కోసం లారీల విషయంలో సంబంధిత ట్రాన్స్‌పోర్డు అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. సీఎంఆర్ పెండింగ్ విషయంలో పౌరసరఫరాల అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్, మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం సివిల్ సప్లయ్ జగదీశ్, మారెటింగ్ అధికారులు పాల్గొన్నారు.