రేగోడ్, జనవరి 5: మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదు లు వెల్లువెత్తాయి. మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 47 దరఖాస్తులు వచ్చాయన్నారు. భూసమస్యలు, పోలీస్, మండల పరిషత్, వివిధ రకాల సమస్యలపై మండలంలోని తహసీల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిష్కరిస్తారన్నారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి మెదక్ కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదని, మీ సమస్యలను ఇక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. రేగోడ్ మండలం మెదక్ జిల్లాలో కొనసాగడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండలంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, నోబుల్ యూత్ సభ్యులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారావమ్మ, నోబుల్ యూత్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ నర్సింహులు సుభాష్, అమృత్, రాజ్‌కమాల్, కిషన్, దిగంబర్‌రావు, పీర్యానాయక్ చోటుమియా, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, యూత్ బాధ్యుడు జగదీశ్ పాల్గొన్నారు.