మెదక్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, మెదక్ చర్చిని సీఎం దర్శించుకోనున్న నేపథ్యంలో మంగళవా రం కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చేసి బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఏడుపాయలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీఎం బుధవారం ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకు మెదక్ జిల్లా పర్యటన కొనసాగుతుందని తెలిపారు.
ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి సీఎం బయలుదేరుతారు. 11 గంటలకు కొల్చారం మండలం చిన్నఘణాపూర్ గ్రామం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి చేరుకుంటారు. 11.10 నుంచి 11.30 వరకు వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకుంటా రు.11.30 నుంచి 11.40 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. 11.45 గంటలకు వందేండ్ల మెదక్ చర్చి వేడుకలకు హాజరవుతారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.25 వరకు చర్చిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12.25 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకొని 12.40 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నగేశ్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.