జహీరాబాద్, ఆగస్టు 11: నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తాం.. జనరల్ అవార్డు కింద పరిహా రం అందించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్‌కు చెందిన నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను హద్నూర్‌కు చెందిన నిమ్జ్ భూ నిర్వాసితులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిమ్జ్ భూనిర్వాసితులు మాట్లాడుతూ నిమ్జ్ ప్రాజెక్డు భూ సేకరణలో తమ భూములు పోతున్నాయని, భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
జనరల్ అవార్డు కింద పరిహారం అందజేసి, ఫైల్‌ను ఎల్ఏఆర్ఆర్కు పంపించాలని కోరారు. మరికొంత మంది గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు కోర్టుకు వెళ్లారని, వారిని మినహాయిం చి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ ని, తమకు జనరల్ అవార్డు కింద పాస్ చేసి పరిహారం అందజేయాలన్నారు. భూములు కోల్పోతున్న వాటిలో ఉన్న బోరు, పైప్‌లైన్, చెట్లు, డ్రీప్, రూమ్‌లకు సంబంధించిన నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్‌కు అందజేసిన వినతి పత్రంలో కోరారు. గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు పాల్గొన్నారు.