మెదక్, మార్చి 27(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు, ఇంధనం సరఫరా విషయంలో కూడా ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుందని, వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కలెక్టర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని తెలిపారు. రోజుకు సగటున 3000 సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు.
అదనంగా జిల్లాలోనీ గ్యాస్ గోదాముల్లో సుమారు 3,500 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 6,500 సిలిండర్లు ట్రాన్సిట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (LPG) సరఫరా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 90 కిలోలీటర్ల పెట్రోల్, 110 కిలోలీటర్ల డీజిల్ అవసరం ఉండగా, ప్రస్తుతం మెదక్ జిల్లాలో 550 కిలోలీటర్ల పెట్రోల్, 644 కిలోలీటర్ల డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సరఫరా యంత్రాంగం నిరంతరంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే ఏర్పడుతున్నాయని తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.