నారాయణఖేడ్, నవంబర్ 14: విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అవసరమని సంగారెడ్డి కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి క్విజ్ పోటీలను స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఆమె పర్యవేక్షించిన సందర్భంగా మాట్లాడారు. విద్యాప్రమాణాలు మెరుగుపర్చే లక్ష్యంతోనే క్విజ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయన్నారు. క్విజ్ పోటీల నిర్వహణలో నారాయణఖేడ్ డివిజన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. విద్యార్థులు రోజూ చదివే అంశాలను క్విజ్ రూపంలో ప్రశ్నించడం ద్వారా విద్యార్థులకు విషయ సంగ్రహణ శక్తి, మేథాశక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు రోజూ తప్పకుండా 15 నిమిషాల నుంచి అరగంట వరకు దినపత్రికలు చదువాలని కలెక్టర్ సూచించారు.
నారాయణఖేడ్‌లోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వంటశాల, విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. వసతి గృహంలోని వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలను విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు. వసతిగృహం పరిసరాలతో పాటు స్నానపు గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి ఉన్నారు.