సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 27: నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధా న్య రంగాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా అధికారులు, వివిధ బ్యాంకు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పంటరుణమాఫీ పథకంలో కొన్ని బ్యాంకులు ఆధార్‌లో తప్పుల సవరణ, ఇతర కారణాలతో జాప్యం చేస్తున్నందున అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల పనితీరు మార్చుకోకుంటే వారిపై ఎస్ఎల్బీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ఎస్‌హెచ్‌జీ లింకేజీలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలో 894 కోట్లకు 750 కోట్లు పూర్తికాగా మిగతా టార్గెట్ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పీఎం- స్వాని ధి, పీఎం- విశ్వకర్మ ప్రక్రియ సైతం పూర్తిచేయాలన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా సేవలందిస్తున్నట్లు తెలిపారు. తునికికాస్ల గ్రామంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం లక్పత్ దీది పథకం ద్వారా ప్రతి ఎస్‌హెచ్‌జీ గ్రూపులో ఒకరికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ ఇన్ప్రా ఫండ్‌లో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో నిలిచినందుకు నాబార్డు వారు అందించిన జ్ఞాపికను కలెక్టర్ చేతులమీదుగా ఎల్డీఎంకు అందజేశారు. సమావేశంలో ఎల్డీఎం హరిబాబు, ఆర్బీఐ ఐడీవో తాన్య, యుబీఐఆర్హెచ్ వికాస్, ఏపీజీవీబీ ఆర్ఎం ఉదయ్ కిరణ్, డీసీసీబీ డీజీఎం విశ్వేశ్వర్, టీజీబీఆర్ఎం బాలనాగు, ఆర్సెట్టి డైరెక్టర్ రాజలింగం, నాబార్డు డీడీఎం నికిల్ పాల్గొన్నారు.