సిద్దిపేట అర్బన్, మే 30: నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురవారం కలెక్టరేట్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు కూడా మోసపోకుండా వ్యవసాయ, పోలీస్ అధికారులు సమన్వయంతో దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సరిపడా జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ జీలుగ విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సీపీ అనురాధ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో నకిలీ విత్తనాల కేసు నమోదు చేయలేదన్నారు. రానున్న 15, 20 రోజులు చాలా ముఖ్యమైనవని, నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను కలిగి ఉన్నా లేదా రైతులకు విక్రయించినా సంబంధిత షాప్‌ల యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
అనంతరం ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ, హార్టికల్చర్, స్టాటిస్టికల్ అధికారులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టం కలిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన చాలా ఉపయోగంగా ఉండి రైతులకు ఆర్థిక చేయూతనందిస్తుందని, ఈ పథకంలో రైతులందరినీ చేర్పించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వానకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, టమాట, మామిడి, ఆయిల్‌పామ్ పంటలకు ఇన్సూరెన్స్ అవకాశం ఉందని దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్, సెరీకల్చర్, వ్యవసాయ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.