సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 18: అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారన్నారు. ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రజావాణికి విధిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లపై 48 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 18: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 42 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.