చేర్యాల, డిసెంబర్ 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. ఈనెల 29న మల్లన్న క్షేత్రంలో స్వామి కల్యాణోత్సవం నేసథ్యంలో కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. కల్యాణం జరిగే తోటబావి, వీఐపీ దర్శనం, శ్రీఘదర్శనం, సాధారణ దర్శనం, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, బస్టాండ్, ఎల్లమ్మ టెంపుల్, నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల సత్రం, క్యూకాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం చేర్యాల, హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట వైపు బస్సులు, ఆటోలు వెళ్లే రూట్లను పరిశీలించారు. కల్యాణం జరిగే తోటబావి వద్ద వీఐపీ దర్శనం, సాధారణ దర్శనం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, కల్యాణం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది లైటింగ్ విషయం లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పార్మర్ల చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైర్ సేప్టీ పై వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించాలని, రాబోయే మూడు నెలలు బ్రహ్మోత్సవాలు కొనసాగనుండడంతో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వ్యాపారులు తమ షాపుల ముందు సామగ్రిని పెట్టి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని, షాపుల నిర్వాహుకులు ముందుకు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు ప్రత్యేకంగా పెయింటింగ్ వేయించాలన్నారు.భక్తులకు 24గంటల పాటు నీటి సరఫరా ఉండేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని, మెడికల్ ఎమర్జెన్సీపై తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారికి సూచించారు.జాతరలో సౌండ్ సిస్టమ్స్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, ఐఅండ్‌పీఆర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
భక్తులకు మొ బైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ఈనెల 25లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్‌హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, ఆలయ ఈవో బాలాజీ, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ట్రాన్స్‌కో ఎస్ఈ చంద్రమోహన్, డీఎంహెచ్‌వో పల్వన్‌కుమార్, డీపీవో దేవకీదేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఏసీపీ సతీశ్, సీఐ శ్రీను, ఎస్ఐ నాగరాజు, డీపీఆర్వో రవికుమార్, పీఆర్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్ డీఈ భూపాల్‌రెడ్డి, ఆర్అండ్బీ డీఈ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, అగ్నిమాపకశాఖ అధికారులు పాల్గొన్నారు.