మెదక్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటుంది.
సాయంత్రం 5 గంటలు దాటితే చల్ల గాలులు వీస్తున్నాయి. చలికాలం జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా చిన్నారులు, వృద్ధుల్లోనే కనిపిస్తుంటాయి. ఈ కాలంలో వైరస్, బ్యాక్టీరియా కూడా సులభంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. వచ్చే రెండు, మూడు నెలలు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ సమయంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు కూడా చలి తీవ్రత నుంచి తట్టుకునేందుకు తప్పనిసరిగా తగిన రక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు.
నవంబర్, డిసెంబర్, జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోతాయి. రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు కూడా వచ్చే ఆస్కారముంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉండటంతో చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా జ్వరం, జలుబు, దగ్గు శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాదు తలనొప్పి, గొంతు సమస్యలతోపాటు శ్వాస పీల్చడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.