నమస్తే తెలంగాణ, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట/ సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, నవంబర్ 15 : చలి తీవ్రత పెరగడంతో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు, ఇతర జీవులు వణికిపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.వెచ్చదనం కోసం ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు.చలినుంచి రక్షణకు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. ఉదయాన్నే పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యే మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్మికులు, చిరువ్యాపారులు, పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు చలితో వణికిపోతున్నారు.
ఊరూరికి బైక్‌లపై వెళ్లి పలురకాల సామగ్రి విక్రయించి బతికేవారు చలిని సైతం లెక్కచేయకుండా జీవన పోరాటం చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు మంకీక్యాప్‌లు, స్వెట్టర్లు, చేతులకు గ్లౌజ్‌లు ధరిస్తున్నారు. ఉదయం టీస్టాళ్ల వద్ద సందడి కనిపిస్తున్నది. వెచ్చదనం కోసం టీ తాగేవారితో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. రోడ్ల పక్కన వెలిసిని ఉన్ని దుస్తుల షాప్‌ల్లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి.