సంగారెడ్డి కలెక్టరేట్, మే 20: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న సీఎం రేవంత్ పర్యటిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం పర్యటనపై మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
జహీరాబాద్లో సీఎం బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంక్, మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని, అనంతరం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సభలో పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.