సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 3: వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సన్నరకం, దొడ్డు రకం ధాన్యం సేకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చొప్పున మద్దతు ధర చెల్లించడంతోపాటు సన్న రకానికి అదనంగా రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన 48గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ కావాలన్నారు.
డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న నేపథ్యంలో విజయదశమికి ముందే ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తామన్నారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 5లోగా పూర్తి చేయాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి నుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్, అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.