రామచంద్రాపురం, జూలై 3: ధరణి పోర్టల్ భూబాధితుల సమస్యలను పరిష్కరిస్తుంది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, పేరు మార్పిడీ తదితర పనులు తహసీల్దార్ స్థాయిలోనే వెంటవెంటనే అయిపోతున్నాయి. గతంలో భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే జిల్లాకేంద్రంలోని రిజిస్ట్రర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ గంటలతరబడి నిరీక్షించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇవ్వన్నీ గమనించిన సీఎం కేసీఆర్ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా జరగాలని, పేదలందరిరీ న్యాయం జరగాలని ఆలోచన చేసి ధరణికి శ్రీకారం చుట్టారు. తహసీల్దార్లకే భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్, పేర్ల మార్పిడీ వంటివి అప్పగించడంతో ఇప్పుడు అందరికీ ఎంతో మేలు జరుగుతుంది.
భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అరగంటలో రిజిస్ట్రేషన్ జరగడంతోపాటు ఐదు నిమిషాల్లో మ్యుటేషన్ చేసుకొని సంతోషంగా వెళ్తున్నారు. గతంలో మాదిరిగా నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు.బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పనిలేదు.లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ధరణిలో పారదర్శకంగా జరుగుతుంది. ఎన్నో ఏండ్లుగా ఉన్న భూసమస్యలు ధరణి రావడంతో పరిష్కారమయ్యాయి. అందుకు నిదర్శనం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామానికి చెందిన ఎస్సీ రైతులే. నలభై ఏండ్లుగా రైతులు వారికి సంబంధించిన అసైండ్ భూమిలో పొజిషన్లో ఉన్నప్పటికీ వారి పాస్ బుక్కులు లేవు. దీంతో రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతుబీమా వారికి అందలేదు. నలభైఏండ్ల నాటి సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారంచూపడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
57మంది రైతులకు ధరణి పాస్‌బుక్కులు
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలోని సర్వేనంబర్ 434లో 1980 నుంచి 1992 వరకు భూమిలేని ఎస్సీ నిరుపేదలకు అసైన్మెంట్ సర్టిఫికెట్లను అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ పాస్‌బుక్కులు రాలేదు. వెలిమెల గ్రామానికి పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామానికి మధ్య శివారు భూవివాదం ఉండడంతో ఎస్సీలకు ఇచ్చిన భూములు తమవంటూ ఆ గ్రామస్తులు ఆ భూముల్లోకి ఎస్సీ రైతులను రానిచ్చే వారు కాదు. ఇలా కొన్నిఏండ్లుగా రెండు గ్రామాల మధ్య భూవివాదం కొనసాగుతుంది. అందులో కొందరు రైతులు మరణించడంతో వారి వారసులు ఉన్నారు. ఇన్నేండ్లు భూవివాధం కారణంగా రైతులకు పాస్ బుక్కులు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా వారికి రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భూబాధితుల సమస్యను పరిష్కరించేందుకు శ్రమించారు. పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు భూసమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేయడంతో రెండు గ్రామాల మధ్య ఉన్న భూవివాదాన్ని పరిష్కరించేందుకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జాయింట్ భూసర్వేను నిర్వహించారు. దీంతో 434లో పొజిషన్లో ఉన్న 57మంది రైతులకు మేలు జరిగింది. తహసీల్దార్ జయరాం నేతృత్వంలో వారందరి పేర్లను ధరణిలో ఎక్కించి వారికి ధరణి పాస్‌బుక్కులను అందజేశారు. నలభై ఏండ్ల తర్వాత వారి భూములకు ధరణి పాస్‌బుక్‌లు రావడంతో వెలిమెల ఎస్సీ రైతులు ఎంతో సంబురపడ్డారు. ఇన్నేండ్లకు మా భూములకు సంబంధించి పాస్‌బుక్కులను చూస్తున్నామంటే అది కేసీఆర్ సర్కారు పుణ్యమేనని రైతులు పేర్కొంటున్నారు.
బతికుండగా పాస్బుక్కు వస్తదనుకోలేదు
బతికుండగా పాస్‌బుక్కులు వస్తదనుకోలేదు. నలభై ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వెలిమెల గ్రామంలో మా కుటుంబానికి దున్నుకోవడానికి భూమిని కేటాయించింది. పక్కనే ఉన్న కొండకల్ ఊరోళ్లు.. ఆ భూమి మాదంటూ మమ్మల్ని ఆ భూమిల్లోకి పోనిచ్చటోళ్లు కాకుండే. మా భూమిని దక్కించుకోవడానికి చాలా తిప్పలుపడ్డం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ.. మా రాత మాత్రం మారలేదు. పాస్‌బుక్కులు లేకపోవడంతో సీఎం కేసీఆర్ రైతులకు ఇస్తున్న రైతుబంధు మాకు అందలేదు. ఇన్నేండ్లకు కేసీఆర్ సర్కారు మా సమస్యను పరిష్కరించి ధరణి పాస్‌బుక్కులు ఇచ్చింది. మా భూమి మాకు దక్కడంతో చాలా ధైర్యం వచ్చింది.
– లలిత, వెలిమెల గ్రామం
ఎస్సీ రైతులకు మేలు జరిగింది..
వెలిమెల, కొండకల్ గ్రామాల మధ్య భూవివాదం ఉండడంతో ఇన్నేండ్లు రైతులు వారి భూములోకి వెళ్లి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు జిల్లాల ఉన్నతాధికారులు, జిల్లా సర్వే టీంలతో కలిసి సంయుక్తంగా సర్వేనంబర్ 434లోని భూమిని సర్వే చేసి 57మంది రైతు కుటుంబాలకు మేలు చేశారు. నలభై ఏండ్ల క్రితం రైతులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పటికీ వివాదం కారణంగా పాస్ బుక్కులు ఇవ్వలేదు. సర్వే ఆధారంగా ఆయా భూములను మా పరిధిలోకి తీసుకొని ఎస్సీ రైతుల పేర్లను ధరణిలో పొందుపర్చి అందరిరీ పాస్‌బుక్కులను అందజేశాం. ఇకనుంచి వారికి రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తాయి. ధరణితో భూమి రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ చేస్తున్నాం. నాలా కన్వర్షన్ కూడా ప్రభుత్వం తహసీల్దార్లకే అప్పగించింది. ధరణి రాకతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడకుండా సులభంగా, వేగంగా తహసీల్దార్ వద్దే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.
– తహసీల్దార్ జయరామ్