ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను విజయవంతంగా ముగించుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లిన ఆయన అదే రహదారిపై రావడంతో, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చెరాగ్‌పల్లి వద్ద జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎంకు స్వాగతం పలికారు.
సంగారెడ్డి జూన్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన విజయవంతం చేసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి 600కుపైగా వాహనాలతో 65వ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు సీఎం తోపాటు మహారాష్ట్రకు వెళ్లారు. సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్ర చేరుకుని షోలాపూర్‌లో సోమవారం రాత్రి బసచేశారు.
మంగళవారం పండరిపురంలో విఠోభా, రుక్మిణి అమ్మవార్ల దర్శనం చేసుకుని, సర్కోలీ గ్రామంలో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం తుల్జాపూర్ చేరుకుని భవానీమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తుల్జాపూర్ నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా తిరుగుపయనమయ్యారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ రాత్రి 9గంటలకు తెలంగాణ సరిహద్దు గ్రామమైన చెరాగ్పల్లిలోకి ప్రవేశించగానే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జహీరాబాద్, కోహీర్, కంకోల్, సదాశివపేట మీదుగా ప్రయాణించి రాత్రి 9.52 గంటలకు సంగారెడ్డి, రుద్రారం, ఇస్నాపూర్, పటాన్చెరు, బీరంగూడ, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి 10.20 గంటలకు సంగారెడ్డి జిల్లా దాటి హైదరాబాద్‌లోకి ప్రవేశించారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్ చేరుకునేంత 65వ నెంబరు జాతీయ రహదారికి ఇరువైపులా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రమణకుమార్ నేతృత్వ్యంలో 200 మందికిపైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.