పెద్దశంకంపేట, జూన్ 24: గరీబోళ్లను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని స్త్రీశక్తి భవనంలో 46 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలను ఎల్లప్పు డూ ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కావద్దనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీంతో 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు పెళ్లి సమయంలో రూ.లక్షా 116లు అందిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోసీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోలేదన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ గురుకులాలు ప్రవేశపెట్టారన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రం లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేలా నాణ్యమైన వైద్యను అందించేలా ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. 70 ఏండ్లలో నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో మంచినీటి కోసం ఆమడ దూరం వెళ్లే వారని, ప్రస్తుతం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు వస్తున్నదన్నారు.
రాబోయే ఎన్నికల్లో మరోమారు తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అంతకు ముందు ధూప దీప నైవేద్య పథకంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, రైతుబంధు అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీటీసీలు దత్తు, దామోదర్, సుభాశ్‌గౌడ్, స్వప్న రాజేశ్, సర్పంచ్‌లు సత్యనారాయణ, రాములు, శంకర్‌గౌడ్, మల్లేశం, తహసీల్దార్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.